నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :
నగరంలోని ఆరవ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట స్థావరంపై చీతా ఫోర్స్ మెరుపు దాడి చేశారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య ఆదేశాల మేరకు సి.సి.ఎస్ ఏసీపీ మస్తాన్ అలీ ఆధ్వర్యంలో చీతా ఫోర్స్ సిబ్బంది శనివారం సారంగాపూర్ ప్రాంతంలో, జిల్లా జైలు పక్కన నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై మెరుపు దాడి నిర్వహించారు. పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారంతో చీతా ఫోర్స్ సిబ్బంది ఆకస్మికంగా అక్కడికి చేరుకొని తనిఖీలు చేపట్టగా, కొందరు వ్యక్తులు బహిరంగంగా పేకాట ఆడుతూ కనిపించారు. వెంటనే వారిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టగా , మొత్తం 5 మంది పేకాట రాయుళ్లను పట్టుకున్నారు. ఈ దాడిలో వారి వద్ద నుండి 3 సెల్ ఫోన్లు, రూ.12,530 నగదును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పట్టుబడిన వ్యక్తులను, స్వాధీనం చేసుకున్న వస్తువులను తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం 6 టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్.హెచ్.ఓ కి అప్పగించారు.
