27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

చైన్ స్నాచింగ్ దొంగల ముఠా అరెస్ట్

Must read

📰 Generate e-Paper Clip

  • 12.2 తులాల బంగారం, ఒక ట్రాక్టర్, రెండు బైక్ ల స్వాధీనం
  • పోలీస్ కమిషనర్  సాయి చైతన్య

 

ఆర్మూర్, బతుకమ్మ : ఆర్మూర్ పోలీస్ స్టేషన్ పరిధితో పాటు నిర్మల్, జగిత్యాల జిల్లాలలో చైన్ స్నాచింగ్ కు పాల్పడే  మహారాష్ట్ర కు చెందిన దొంగల ముఠాను అరెస్టు చేసినట్లు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. వీరి వద్ద నుంచి 18 లక్షల విలువ గల 12.2 తులాల బంగారం, ఒక ట్రాక్టర్, రెండు మోటార్ సైకిల్ లను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని పోలీస్ స్టేషన్ లో గురువారం జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మోటార్ సైకిల్ ల వెనకాల కూర్చున్న మహిళలను టార్గెట్ చేసుకొని, ఆటో వెనకాలే వెళ్లి మహిళల మెడలో నుంచి బంగారు గొలుసులను తెంపుకొని పరారయ్యే చైన్ స్నాచింగ్ దొంగల ముఠాను గురువారం 44 వ జాతీయ రహదారిపై పెర్కిట్ వద్ద అరెస్టు చేసినట్లు తెలిపారు. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా బోకర్ తాలూకా పొంనాల గ్రామానికి చెందిన శ్రీనివాస్ సాహెబ్ రావు పీఠేవాడ్, గోరే కేశవ్ సురేష్, పురుబాజీ బాలాజీ ఇర్లేవాడ్, నిర్మల్ జిల్లా తల్వాడ గ్రామానికి చెందిన ఎలిశెట్టి శ్రీనివాస్, మహారాష్ట్రకు చెందిన రాజు అప్పారావు పీటేవాడ్ లను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్లు తెలిపారు.

Chain snatching gang arrested

విజయ్, దండేవాడ్ బాబు పరారీలో ఉన్నట్లు వివరించారు. వీరు ఏడుగురు కలిసి నిర్మల్ జిల్లా మంజులాపూర్ గ్రామానికి వలస వచ్చి కూలి పని చేసుకుంటూ జీవిస్తున్నా రన్నారు. కూలి పని చేయగా వచ్చిన డబ్బులతో కుటుంబ పోషణ సరిపోక జల్సాలకు అలవాటు పడి దొంగతనాలు చేస్తున్నారన్నారు. దొంగ లించిన హీరో స్పెండర్ బైక్, బుల్లెట్ బైక్ పై తిరుగుతూ ఆటోలో వెనకాల కూర్చున్న మహిళలను టార్గెట్ చేసుకొని వారి మెడలో నుంచి బంగారు గొలుసులను తెంపుకొని పరారయ్యే వారన్నారు. వీరు ఆర్మూర్ ప్రాంతంలో రెండు, ముప్కల్ ఒకటి, సారంగాపూర్ మండలంలో రెండు, బైంసా మండలంలో ఒకటి, జగిత్యాల జిల్లా మెట్ ల్లిలో ఒకటి, జక్రాన్ పల్లి మండలంలో దొంగతనం ప్రయత్నం చేసి ట్రాక్టర్ ను దొంగతనం చేశారన్నారు. వీరు చేసిన వరుస దొంగతనాల వలన పోలీసులు నిఘా పెట్టడంతో మహారాష్ట్రలోని ఉమ్రి గ్రామానికి పారిపోయి సెల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకుని అక్కడే ఉన్నారన్నారు. గురువారం రెండు బైకులపై తిరిగి దొంగతనం చేయడానికి ఆర్మూర్ వైపునకు రాగా పెర్కిట్ బైపాస్ దగ్గర వాహనాలు తనిఖీ చేస్తుండగా పట్టుకోవడం జరిగిందని, వీరు దొంగతనాలు చేసినట్లు అంగీకరించారన్నారు. వీరి వద్ద నుంచి 14 గ్రాముల పుస్తెలతాడు, 10 గ్రాముల బంగారు చైన్, 23 గ్రాముల బంగారు గొలుసు, 10 గ్రాముల గుండ్ల పేరు, ఐదు గ్రాముల పుస్తెల గుండ్ల పేరు, 60 గ్రాముల మూడు బంగారు గొలుసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వీరి వద్ద నుంచి ఒక ట్రాక్టర్ తోపాటు రెండు బైక్ లను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.

Chain snatching gang arrested

  • పోలీసులకు అభినందన…

ఆర్మూర్ పట్టణంలో వరుస చైన్ స్నాచింగ్ చోరీలకు పాల్పడే అంతర్ రాష్ట్ర ముఠాను పట్టుకున్న పోలీస్ అధికారులను సిపి సాయి చైతన్య అభినందించారు. ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో సీఐ సత్యనారాయణ గౌడ్, రూరల్ సీఐ శ్రీధర్ రెడ్డి, ఎస్సై రజనీకాంత్ దొంగలను పట్టుకోవడానికి కృషి చేశారన్నారు.అదే విధంగా ఆర్మూర్ పోలీస్ స్టేషన్ క్రైమ్ పార్టీ, నిజామాబాద్ సి ఆర్ డి సిబ్బందిని అభినందించి నగదు బహుమతి అందజేస్తామన్నారు. ఈ సమావేశంలో ఆర్మూర్  ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి, ఆర్మూర్ ఎస్ హెచ్ ఓ సత్యనారాయణ గౌడ్, ఆర్మూర్ రూరల్ సిఐ శ్రీధర్ రెడ్డి,ఎస్సై రజినీకాంత్, ఆర్మూర్ పోలీస్ స్టేషన్ క్రైమ్ పార్టీ పోలీసులు పాల్గొన్నారు.

Chain snatching gang arrested

More articles

Latest article