- ర్యాగింగ్ చేసిన.. సహకరించిన శిక్షార్హులే
- పోలీస్ కమిషనర్ సాయి చైతన్య
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబిబిఎస్ చివరి సంవత్సరం చదువుతున్న ఐదుగురు విద్యార్ధులపై స్థానిక ఒకటవ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసినట్లు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబిబిఎస్ నాల్గవ సంవత్సరం చదువుతున్న గౌరవరం రాహుల్ రెడ్డి అనే విద్యార్థిపై శనివారం మెడికల్ కళాశాలలో ఎంబిబిఎస్ ఫైనల్ ఇయర్ చదువుతున్న సాయిరాం పవన్, శ్రావణ్, సాత్విక్, హృదయ పాల్, అభినవ్ పెద్ది ఆదిత్య అనే సీనియర్స్ కలిసి రాహుల్ రెడ్డిని చేతులతో కొట్టి కాలేజీలో ఎలా ఉంటావో ఎలా తిరుగుతావో ఎలా పాస్ అవుతావో చూస్తాము అంటూ భయభ్రాంతులకు గురి చేశారు. రాహుల్ రెడ్డి స్నేహితులతో కలిసి హాస్టల్ కు వెళ్లేసరికి అక్కడ సుమారు 15 మంది సీనియర్స్ ర్యాగింగ్ చేసే విధంగా గోడకుర్చీ, జి.ఎం.సి. సెల్యూట్ చేయించి అతని బయోడేటా పలుమార్లు చెప్పించారు. బట్టలు విప్పించి బయట తిప్పిస్తామని బెదిరించారు. స్నేహితులు ఆపడానికి మధ్య వస్తే వాళ్లను కూడా కొడతామని బెదిరించారు. వారి నుండి తప్పించుకోని హాస్టల్ నుండి పారిపోయి ఇంటికి వెళ్లి తనకు ప్రాణ రక్షణ కల్పించాలని స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్టు సిపి తెలిపారు.
- ర్యాగింగ్ చేసిన.. సహకరించిన శిక్షార్హులే : పోలీస్ కమిషనర్ సాయి చైతన్య
భవిష్యత్తులో మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ కి ఎవరైనా పాల్పడితే వారి పైన కఠిన చర్యలు ఉంటాయని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య హెచ్చఃరించారు. ఎవరైనా ర్యాగింగ్ చేస్తున్నట్లు తెలిసిన లేదా గమనించిన లేదా ర్యాగింగ్ కు సహకరించిన వారి సమాచారం దగ్గరలోని పోలీస్ స్టేషన్ వారికి లేదా డయల్ 100 కు లేదా పోలీస్ కంట్రోల్ రూమ్ నెంబర్ 8712659700 కు సమాచారాన్ని అందించాలని కోరారు. ర్యాగింగ్ చేసిన, సహకరించిన శిక్షర్హులే అన్నారు. ర్యాగింగ్ గురించి సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంచబడును అని సిపి తెలిపారు.
