- బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
బాన్సువాడ, బతుకమ్మ : కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును బీఆర్‌ఎస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం బాన్సువాడలోని బక్రాన్ బీడీ కాంప్లెక్స్ లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. మైనారిటీలకు వ్యతిరేకంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏ నిర్ణయం తీసుకున్నా మీ తరుఫున కొట్లాడడానికి బీఆర్‌ఎస్ పార్టీ ముందుంటుందని అన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు ఆందోళనలో ఉన్నారని, రియల్ ఎస్టేట్ రంగం తీవ్రంగా దెబ్బతిన్నదని తెలిపారు. తెలంగాణలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న పదేళ్లలో ఒక్కటంటే ఒక్క మత ఘర్షణ కూడా జరగలేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 15 నెలల్లో నెలకు ఒకటి చొప్పున మత ఘర్షణలు చోటు చేసుకున్నాయన్నారు. కానీ ముఖ్యమంత్రి ఏ ఒక్కరోజు ఈ ఘటనలపై రివ్యూ చేయలేదని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ఫ్లయిట్ మోడ్ సీఎం అని ఎద్దేవా చేశారు.

ఈ ముఖ్యమంత్రి ఏం చేయాలన్నా, ఏ నిర్ణయం తీసుకోవాలన్న ఢిల్లీకి వెళ్లి పర్మిషన్ తీసుకోవాలని విమర్శించారు. ఆయన ఇప్పటి వరకు 40 సార్లు ఢిల్లీకి పోయిండని తెలిపారు. జైనూర్ లో మూడు నెలలు ఇంటర్నెట్ బంద్ పెట్టారని, అక్కడ హిందూముస్లింల ఇండ్లను దహనం చేసినా ముఖ్యమంత్రికి వాటిపై సమీక్షించేంత తీరిక లేదని అన్నారు. ముస్లింలకు కేసీఆర్ రంజాన్ తోఫా ఇచ్చారని, కానీ ఈ ప్రభుత్వం వాటిని బంద్ చేసిందని అన్నారు. మైనార్టీల కోసం పెట్టిన బడ్జెట్ లో 25 శాతం నిధులు కూడా ఖర్చు చేయలేదని తెలిపారు. ముస్లిం యువత, మహిళలకు స్వయం ఉపాధి కల్పించేందుకు బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు తీసుకువచ్చిందనితెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.
