- తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
హైదరాబాద్, బతుకమ్మ : రాజకీయాలకు, మతాలకు, కులాలకు అతీతంగా అలయ్.. బలయ్ నిర్వహించడం అభినందనీయమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో మాజీ గవర్నర్, బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలో అలయ్ – బలయ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ‘‘గత 20 ఏళ్లుగా దత్తాత్రేయ గారు అలయ్ బలయ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. రాజకీయాలకు, మతాలకు, కులాలకు అతీతంగా ఆయన ఈ కార్యక్రమం చేపట్టారు. పది మందితో ఆనందం పంచుకోవటమే పండుగంటే. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా ఆనందాన్నిపంచుకునే వేదికే అలయ్, బలయ్ కార్యక్రమం. దత్తాత్రేయ కూతురు విజయలక్ష్మి కూడా వారి వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని ఈ కార్యక్రమం

చేయటం ఆనందంగా ఉంది. విజయలక్ష్మికి అభినందనలు. భవిష్యత్ లోనూ ఈ కార్యక్రమాన్ని సక్సెస్ ఫుల్ గా వారు నడిపించాలి. దత్తాత్రేయంటే బీజేపీ నాయకులు గానో, గవర్నర్ గానో మాకు గుర్తుకు రారు. దత్తన్న అంటే పదిమందిని కలుపుకొని పోయే తెలంగాణ వ్యక్తిత్వం కలిగిన వారిగానే గుర్తుకు వస్తారు. రాజకీయాల్లో ఎదుగుతున్న క్రమంలో చాలా మంది నాకు దత్తన్న గురించి చెప్పేవాళ్లు. ఏదైనా పనికోసం ఎవరు ఆయన వద్దకు వెళ్లిన సరే వాళ్ల సమస్య తీర్చే వాళ్లని చెప్పే వారు. వారికి ఉత్తరం ఇచ్చి ఆ సమస్య తీరే వరకు ఫాలో అప్ చేసే వారని మాకు చెప్పేవాళ్లు. ఆయన మాదిరిగా రాజకీయాల్లో ఉండాలని అనేవాళ్లు. అలాంటి దత్తాత్రేయ ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమంలో పాల్గొనటం సంతోషంగా ఉంది. 20 ఏళ్లుగా కొనసాగుతున్న అలయ్ బలయ్ కార్యక్రమం ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తి గా కోరుకుంటున్నా’’ అని అన్నారు.

