. . . లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తాం
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ ను వెంటనే అరెస్ట్ చేయాలని పిడిఎస్ యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్, పి వో డబ్ల్యు నగర ప్రధాన కార్యదర్శి జి.సంజన, పి వై ఎల్ జిల్లా అధ్యక్షులు వనమాల సత్యం లు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నగరంలో కోటగల్లి నీలం రామచంద్రయ్య భవన్ లో ప్రజాసంఘాలు పిడిఎస్ యు, పిఓడబ్ల్యూ, పివైఎల్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మైనర్ బాలికకు బలవంతంగా డ్రగ్స్ తాగిపించి అత్యాచారం చేశాడని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ పై హైదరాబాద్ పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో ఈనెల 8వ తేదీన పోక్సో కేసు నమోదు అయిందనీ, ఈ కేసు నమోదయి మూడు రోజులు కావస్తున్న పోలీసులు ఇప్పటివరకు బండి భగీరథ పై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం శోచనీయమని అన్నారు. పోక్సో కేసు నమోదైతే వెంటనే అమ్మాయి వాయిస్ ను జడ్జి ముందు రికార్డు చేయాలని, నేరారోపణ ఎదుర్కొంటున్న నిందితుడిని వెంటనే అరెస్టు చేసి విచారించాలని నిబంధనలు ఉన్నా పోలీసులు అటువంటి చర్యలు తీసుకోకపోవడం అనేక అనుమానాలకు తావిస్తుందన్నారు. గతంలో కూడా బండి సాయి భగీరథ చదువుకుంటున్న కాలేజీలో విద్యార్థుల్ని ఈవ్ టీజింగ్, ర్యాగింగ్ చేశాడని భౌతిక దాడులకు పాల్పడ్డాడని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయని, అటువంటి ఘటనకు సంబంధించిన వీడియోలు ఫోటోలు సాక్షాదారాలుగా పెద్ద ఎత్తున వచ్చాయని, ఇప్పుడు మైనర్ బాలికను అత్యాచారం చేశాడని కేసు నమోదు అయిందన్నారు. ఈ కేసు నుండి తప్పించుకోవడం కోసం బండి సాయిభగీరథ కరీంనగర్ లో సదరు బాలికపై హనీ ట్రాప్ చేసిందని కేసు పెట్టాడు. ఆరోపణలను చట్టం ముందు ధైర్యంగా ఎదుర్కోవడం చేతకాక ఇలాంటి కౌంటర్ కేసులు పెట్టడం దుర్మార్గమని, బండి సంజయ్ అతని కుమారుడు భగీరథ తన ఆర్థిక, రాజకీయ, అంగ బలాన్ని ఉపయోగించి ఈ కేసును ఎలా అయినా మాఫీ చేయాలని తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారన్నారు. సాక్షాత్తు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ తన కుమారుడిపై మైనర్ బాలికపై అత్యాచార ఆరోపణలు వస్తే స్వచ్ఛందంగా ఆ పదవికి రాజీనామా చేయాల్సింది పోయి అదొక రాజకీయ కుట్ర అని ప్రకటించడం తన బాధ్యతారాహిత్యాన్ని తెలియజేస్తుందని పేర్కొన్నారు. బిల్కీస్ భానో అత్యాచార నిందితులను విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం సహకరించిందని, వారు విడుదలయ్యాక బిజెపి నాయకులు సన్మానాలు కూడా చేశారన్నారు. మహిళలపై బాలికలపై అత్యాచారాలు చేసిన ఆశారాంబాపు, డేరాబాబా లాంటి అనేకమంది అత్యాచార నిందితులకు సంవత్సరాల తరబడి పెరోల్ ఇచ్చి కాపాడుతున్నారని, బిజెపి ప్రజా ప్రతినిధులు నాయకులపై ఇలాంటి ఆరోపణలు వస్తే కనీసం విచారణ కూడా చేయడం లేదని మండిపడ్డారు. ఇది బిజెపి పార్టీ చెప్పే “బేటి బచావో బేటి పడావో” పట్ల వీరి చిత్తశుద్ధిని తెలియజేస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ యంత్రాంగం ఈ ఘటనపై వెంటనే స్పందించి అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్న సాయి భగీరథను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. బాధిత మైనర్ బాలికకు రాష్ట్ర ప్రభుత్వం భద్రత ఇవ్వాలని, కేసును నిష్పక్షపాతంగా విచారణ చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం హోంశాఖ సహాయ మంత్రి గా ఉన్న బండి సంజయ్ ను వెంటనే భర్త రఫ్ చేయాలని, లేని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రజాసంఘాల నాయకులు పవన్, భవాని, జమున, హారతి తదితరులు పాల్గొన్నారు.
