నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : ఇంటెలిజెన్స్ ఏఎస్ఐ భీంరావు భార్య మాక్లూర్ భవాని(58) బుధవారం రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. బుధవారం ఉదయం తన కుమారుడితో కలిసి ద్విచక్ర వాహనంపై బాసరకు వెళ్లారు.అమ్మవారి దర్శనం అనంతరం తిరిగొస్తూ ప్రమాదానికి గురయ్యారు. కంఠేశ్వర్ బైపాస్ మీద వస్తుండగా వీరి వాహనానికి ఒక కుక్క అడ్డుగా వచ్చింది. దీంతో భవాని కుమారుడు సడెన్గా బ్రేక్ వేశాడు. ఈ క్రమంలో వాహనంలో కొంగు చిక్కుకోవడంతో భవాని అదుపు తప్పి కింద పడిపోయారు. కింద పడిన ఆమె తలకు బలమైన గాయం కావడంతో వెంటనే సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే, ఆమెను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
