కామారెడ్డి, బతుకమ్మ: ఇంటర్మీడియెట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని, మాల్ ప్రాక్టీస్ కు తావులేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. చీఫ్ సూపరింటెండెంట్ లు, డిపార్టుమెంటల్ అధికారులతో ఆయన శనివారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ నెల 5 నుంచి 25వ తేదీ వరకు ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షలు కొనసాగనున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. జిల్లాలోని 38 సెంటర్ లలో 18,469 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని, ఇందులో మొదటి సంవత్సరం విద్యార్థులు 8743 మంది, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 9726 మంది ఉన్నారని వివరించారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు కొనసాగుతాయన్నారు. పరీక్ష కేంద్రంలో తాగునీరు, విద్యుత్ సరఫరా, మెడికల్ టీములు ఏర్పాటు చేయడం జరుగుతుందని, సూపరింటెండెంట్ రూంలో సీసీ టీవీ ఏర్పాటుచేయాలలని పేర్కొన్నారు. ప్రశ్నాపత్రాలను పోలీస్ స్టేషన్ నుంచి బందోబస్తుతో తీసుకురావాలని అన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ (రెవిన్యూ) వి.విక్టర్, జిల్లా ఇంటర్మీడియట్ విద్య శాఖాధికారి షేక్ సలాం, పరీక్షల విభాగం అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
