బతుకమ్మ, బోధన్: కేంద్ర ప్రభుత్వ సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ 2020 ఆగస్టు 15న ప్రారంభించిన నషా ముక్త్ భారత్ అభియాన్ ఐదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బుధవారం బోధన్ మునిసిపల్ కార్యాలయ ఆవరణలో మాదక ద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. మునిసిపల్ సిబ్బంది, మెప్మా మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు కలిసి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, యువత, పిల్లలు, మహిళలు మాదక ద్రవ్యాల బానిస కాకూడదని పిలుపునిచ్చారు. డ్రగ్స్ రహిత సమాజాన్ని లక్ష్యంగా పెట్టుకుని తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వాములమవుతామని ప్రతిజ్ఞ స్వీకరించారు. దేశ వ్యాప్తంగా డ్రగ్స్ వ్యసనం నిర్మూలనకు అవగాహన కల్పించడం, ఉన్నత విద్యా సంస్థలు, యువజన సంఘాలు, మహిళా సంఘాలకు ప్రత్యేక చైతన్యం అందించడం ఎన్ఎంబీఏ ప్రధాన లక్ష్యమని అధికారులు తెలిపారు. డ్రగ్స్ విక్రయం, కొనుగోలు, అక్రమ రవాణాను అరికట్టడానికి ప్రతి పౌరుడు బాధ్యత వహించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ డీఈ యోగేష్, ఏఈ ముఖాయ్యర్, ఎస్ఐ గణేష్, మేనేజర్ రమేష్, మెప్మా టీఎంసీ శ్రీనివాస్, మునిసిపల్ సిబ్బంది, పట్టణ సమాఖ్య అధ్యక్షురాలు రఫియా సుల్తానా, ఆర్పీ లు సురేఖ, సునీతతో పాటు మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

