. నమ్మించి రూ.7కోట్ల వరకు వసూలు
. వెంచర్లు చేస్తానని చెప్పి ఒక్క ప్లాటు చూపని మాయగాడు
. అధికార పార్టీ ముఖ్యడు తన వెనుక ఉన్నాడని ప్రచారం
. ‘గుడ్డు’ భాయ్ ని నమ్మి నట్టేట మునిగిన పలువురు
నిజామాబాద్, బతుకమ్మ: రియల్ ఎస్టేట్ లో భారీ లాభాల ఆశ చూపి ఓ వ్యక్తి ఏకంగా రూ.7కోట్ల వరకు వసూలు చేసినట్లు తెలుస్తోంది. మోసం చేసిన వారు.. మోసానికి గురైన వారంతా ఒకే వర్గానికి చెందిన వారు కావడం గమనార్హం. ముద్దుగా ‘గుడ్డు’ అని పిలిపించుకునే జిల్లా కేంద్రంలోని బర్కత్ పురాకు చెందిన సదరు వ్యక్తి రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని బంగారు గుడ్లు పెట్టే బాతుగా నమ్మించాడు. వెంచర్లు చేస్తానని చెప్పడంతో ‘గుడ్డు’ మాటలను గుడ్డిగా నమ్మిన వారు లక్షలాది రూపాయలు చేతిపెట్టారు. డబ్బులు వసూలు చేసిన గుడ్డు భాయ్ ఇంత వరకు ఒక ప్లాట్ చేసింది లేదు.. ఏ ఒక్కరికీ రిజిస్ర్టేషన్ చేసింది లేదు. గత శుక్రవారం నుంచి ‘గుడ్డు’ కనిపించకుండాపోవడంతో డబ్బులు ఇచ్చిన వారంతా ఏం చేయాలో తెలియక చేతులు పిసుక్కుంటున్నారు.
రూ.10లక్షల నుంచి రూ.కోటి వరకు..
గుడ్డు భాయ్ ని నమ్మి ఒక్కొక్కరు రూ.లక్షల నుంచి రూ.కోటి వరకు ముట్టజెప్పారు. హోటల్, కళాశాల, ఫంక్షన్ హాల్ వ్యాపారాల్లో ఉన్న వ్యక్తి రూ.50లక్షలు, ఓ డెకొరేటర్ రూ.కోటి ఇచ్చారు. గల్ఫ్ దేశాల్లో ఉంటున్న వ్యక్తి రూ.45లక్షలు ఇన్వెస్ట్ చేయగా అతడికి ‘గుడ్డు’ చెక్కులు, బాండ్ పేపర్ రాసిచ్చినట్లు సమాచారం. ఇదిలా ఉండగా ప్రైవేట్ ఆస్పత్రిలో పార్టనర్ గా ఉన్న వ్యక్తి రూ.20లక్షలు, ఎన్ ఆర్ ఐ రూ.20లక్షలు, ఖిల్లా రోడ్డులోని సూపర్ మార్కెట్ యజమాని రూ.30లక్షలు, డాక్యుమెంట్ రైటర్ రూ.10లక్షలు వసూలు చేశాడు. మరో ఇద్దరు మహిళలు రూ.10లక్షల చొప్పున ‘గుడ్డు’కు ఇచ్చారు.
మేరే పీచే భాయ్ హై..
రియల్ ఎస్టేట్ పేరుతో రూ.7కోట్లు వసూలు చేసిన ‘గుడ్డు’ భాయ్ తన వెనుక అధికార పార్టీకి చెందిన ముఖ్య నాయకుడు ఉన్నారని అందరినీ నమ్మించినట్లు సమాచారం. సదరు నాయకుడి పేరు చెప్పడం, ఆ పార్టీ అధికారంలో ఉండడంతో డబ్బులు ఇన్వెస్ట్ చేసేందుకు ముందుకు వచ్చారు. కోట్లాది రూపాయలు వసూలు చేసిన ‘గుడ్డు’ గప్ చుప్ గా ఉన్నాడు. ఆ తరువాత ఏకంగా కనిపించకుండా పోవడంతో డబ్బులు ఇచ్చిన వారు ఆందోళనకు గురవుతున్నారు. అటు అధికార పార్టీ నాయకుడి వద్దకు వెళ్లడమా? ఇటు పోలీసులను ఆశ్రయించడమా? తేల్చుకోలేకపోతున్నారు.