. దేశ చరిత్రలోనే ఓ రికార్డు
. ఇందిరమ్మ ప్రభుత్వ ఆలోచనకు అద్దం పడుతోంది
. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
హైదరాబాద్, బతుకమ్మ: విద్యుత్ కార్మికులకు కోటి రూపాయలకు పైబడి ప్రమాద బీమా అందించడం దేశ చరిత్రలోనే రికార్డు అని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. టీఎస్ ఎన్ పీడీసీఎల్ లో విధులు నిర్వర్తిస్తూ ప్రమాదవవశాత్తు ప్రాణాలు కోల్పోయిన జోగు నరేశ్ కుటుంబ సభ్యులకు సోమవారం ఉదయం ప్రజాభవన్ లో రూ.కోటి ప్రమాదబీమా చెక్కును భట్టి విక్రమార్క అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యుత్ కార్మికుని కుటుంబానికి రూ.కోటి ప్రమాద బీమా చెక్కును అందించడం కేవలం సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ఇందిరమ్మ ప్రభుత్వంలోనే సాధ్యమైందన్నారు. గతంలో కార్మికుల కోసం ఏ ప్రభుత్వం ఇంత గొప్పగా ఆలోచించలేదని అన్నారు. ప్రమాద బీమా, కారుణ్య నియామక పత్రం అందించడం ప్రభుత్వ ఆలోచనకు, కార్యాచరణకు, మానవీయ కోణానికి అద్దం పడుతోందన్నారు.
కార్మికులకు ప్రమాద బీమా పథకాన్ని మొదట సింగరేణిలో ప్రవేశపెట్టి అనంతరం విద్యుత్ సంస్థల్లోనూ ఆచరణలోకి తీసుకువచ్చినట్లు డిప్యూటీ సీఎం గుర్తు చేశారు. కోటి రూపాయల పైబడి ప్రమాద బీమా విద్యుత్ సంస్థలో పనిచేసే కార్మికుల అందరిలో ఓ కొత్త భరోసా నింపుతుంది అన్నారు. విద్యుత్ ఉద్యోగులు అంకితభావంతో రాష్ట్ర ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కోరారు. ప్రభుత్వ ఆలోచనను సమర్థవంతంగా అమలు చేసిన ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డిని ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం అభినందించారు.
కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి విద్యుత్, బ్యాంకు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
