28.8 C
Hyderabad
Monday, August 3, 2026

శాంతియుతంగా నిరసన చేయడం ప్రతి పౌరుడి హక్కు

Must read

📰 Generate e-Paper Clip

 

. . . సమాచార హక్కు చట్టం సాధన కమిటీ రాష్ట్ర అధ్యక్షురాలు సూర స్రవంతి

 

వెబ్ డెస్క్, బతుకమ్మ :

 

ప్రజాస్వామ్య దేశంలో శాంతియుతంగా నిరసన వ్యక్తం చేయడం ప్రతి పౌరుడి రాజ్యాంగబద్ధమైన హక్కు అని సమాచార హక్కు చట్టం సాధన కమిటీ రాష్ట్ర అధ్యక్షురాలు సూర స్రవంతి పేర్కొన్నారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులపై జరిగిన పోలీసు చర్యను స్రవంతి తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, అలాంటి నిరసనలను పోలీసు లాఠీచార్జ్ ద్వారా అణచివేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని ఆమె విమర్శించారు. విద్యార్థులు లేవనెత్తుతున్న న్యాయమైన డిమాండ్లపై కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి, వారితో చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించాలని కోరారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూర స్రవంతి డిమాండ్ చేశారు. యువత సమస్యలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయరాదని, యువతతో విభేదించే విధానాలు ప్రజాస్వామ్యానికి మంచివి కావని ఆమె అభిప్రాయపడ్డారు. పేపర్ లీకేజీ ఘటనలపై కూడా ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. పేపర్ లీకేజీలకు బాధ్యులైన వారు ఇంకా స్వేచ్ఛగా తిరుగుతున్నారని ఆరోపించారు. దేశవ్యాప్తంగా జరిగిన ప్రశ్నపత్రాల లీకేజీల కారణంగా కోట్లాది మంది విద్యార్థులు నష్టపోయారని పేర్కొన్నారు. పేపర్ లీకేజీ కేసుల్లో బాధ్యులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని, అప్పుడే కష్టపడి చదివే పేద విద్యార్థులకు న్యాయం జరుగుతుందని అన్నారు. భవిష్యత్తులో పేపర్ లీకేజీలు జరగకుండా పటిష్ఠమైన వ్యవస్థను ఏర్పాటు చేసి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని సూర స్రవంతి ప్రభుత్వాన్ని కోరారు.

More articles

Latest article