నిజామాబాద్, బతుకమ్మ: “మహిళా ఉన్నతి – తెలంగాణ ప్రగతి” కార్యక్రమంలో భాగంగా ఎడపల్లి మండల కేంద్రంలో నిర్వహిస్తున్న ఇందిరమ్మ మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమాన్ని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఐ.కే.పీ సిబ్బంది క్షేత్రస్థాయిలో ఇంటింటికి వెళ్లి మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేస్తున్న తీరును తీరును పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఇందిరమ్మ చీరల పంపిణీ పూర్తి పారదర్శకంగా, సజావుగా జరగాలని అన్నారు. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి తెలంగాణ సంప్రదాయాన్ని అనుసరిస్తూ గౌరవ ప్రదమైన రీతిలో ప్రభుత్వం తరపున మహిళలకు చీరను అందించాలని సూచించారు. ఎలాంటి విమర్శలు, వివాదాలకు తావు లేకుండా, అర్హులైన ప్రతి మహిళకు ఇందిరమ్మ చీర పంపిణీ జరిగేలా పకడ్బందీ పర్యవేక్షణ చేయాలని సూచించారు. పంపిణీ ప్రక్రియను వేగంగా చేపట్టి నిర్ణీత గడువు లోపు పూర్తి చేయాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ దత్తాద్రి, ఐకేపీ సిబ్బంది ఉన్నారు.

