- రైసుమిల్లులకు తరలుతున్న పీడీఎస్
- చోద్యం చూస్తున్న పౌర సరఫరాల శాఖ
- కొత్త దారుల్లో తరులుతున్న బియ్యం
నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లాలో రేషన్ బియ్యం సీఎంఆర్ రూపంలో రీసైక్లింగ్ కోసం తరలిపోతుంది. రేషన్ దుకాణాల్లో సన్నబియ్యం పంపిణీ జరుగుతున్న మిల్లర్లు వాటిని కస్టమ్ మిల్లింగ్ రైస్ కోసం కొనుగోలు చేస్తున్నారు. ఇప్పుడు ఈ దందా జోరుగా సాగుతుంది. సన్నబియ్యం పంపిణీ జరిగితే దానిని ఎవరు అమ్మరని అనుకున్న అధికారుల ఆలోచనను తప్పు అని నిరూపిస్తున్నారు. గడిచిన నాలుగు రోజుల్లో నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో భారీగా పీడీఎస్ బియ్యం పట్టుబడింది. ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా నేరుగా (బీపీఎల్) దారిద్ర రేఖ దిగువన ఉన్న వారి కుటుంబాలకు చేరాల్సిన బియ్యం పక్కదారి పడుతుంది. ప్రధానంగా నిజామాబాద్ జిల్లాలో వందల కోట్ల ధాన్యాన్ని దిగమింగిన ఘనత వహించిన మిల్లర్లు పీడీఎస్ బియ్యం ద్వారా ఆ లోటును తీర్చుకునే పనిలో పడ్డారు. జిల్లాలో కోట్ల రూపాయల కుంభకోణం జరిగిన పాలకులు, అధికారులు కళ్ళు మూసుకుంటుండడంతో ఈ పరిస్థితి తలెత్తింది. ఉమ్మడి జిల్లా ధాన్యం పండించడంలో రాష్ట్రంలోనే పేరు గడించగా సేకరణలోనూ అదే పరిస్థితి ఉంది. అంతేస్థాయిలో వడ్లు లేదా బియ్యాన్ని ఎఫ్ సిఐకి అప్పగించకుండానే మిల్లర్లు అమ్ముకునే నీచ చరిత్ర కూడా ఉంది. పొలిటికల్ సపోర్టుతో పాటు మిల్లర్ అసోసియేషన్ల నేతలు కావడం, అధికారుల ధనదాహం కారణంగా బియ్యం బహిరంగ మార్కెట్లో రీసైక్లింగ్ ద్వారా తిరిగి ఎఫ్ సిఐకే చేరుతుంది.
నిజామాబాద్ జిల్లాలో రైసుమిల్లులకు కేంద్రంగా ఉన్న నిజామాబాద్ రూరల్ మండలం ఖానాపూర్, కాలూర్ రోడ్డులో పార్కింగ్ వద్ద శనివారం 29 టన్నుల పీడీఎస్ బియ్యం పట్టుబడింది. నిర్మల్ జిల్లా చించోలికి చెందిన బియ్యం నిజామాబాద్ రైసుమిల్లుకు తరలించారు. సూపర్ మార్కెట్ కు తరలిస్తున్నట్లు బిల్లులు తయారు చేసి తరలిస్తుండగా విశ్వసనీయ సమాచారంతో పోలీసులు పట్టుకోవడంతో ఈ వ్యవహరం గుట్టురట్టయింది. ఇటీవల మాక్లూర్ మండలం అడవిమామిడిపల్లి ప్రాంతంలో రైసుమిల్లుకు తరలుతున్న పీడీఎస్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. దాని తీగల లాగితే డొంక కదిలినట్లు మరొక డీసీఎం లోడ్ బియ్యాన్ని ఆర్మూర్ లో పట్టుకున్నారు. ఇటీవల బాన్సువాడ శివారులో హైదరాబాద్ నుంచి కోటగిరి వైపు వస్తున్న పీడీఎస్ బియ్యాన్ని పట్టుకున్నారు. 12 టన్నుల పీడీఎస్ బియ్యం రైసుమిల్లుకు తరలిస్తుండగా పట్టుకున్నారు. శుక్రవారం రాత్రి బాన్సువాడ పట్టణంలోని మదీనా కాలనీలో రేషన్ బియ్యాన్ని లోడ్ చేస్తుండగా ఏఎస్సై సీతారామలక్ష్మీ ఆధ్వర్యంలో పట్టుకున్నారు. 40 క్వింటాళ్ళ పీడీఎస్ బియ్యం ఉండడం విశేషం. ఇటీవల కామారెడ్డి పట్టణంలోనూ పొరుగు ప్రాంతం నుంచి తరలివస్తున్న బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. టాస్క్ ఫోర్స్ సూచన మేరకు పట్టుకున్న బియ్యంను స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 18న సిరికొండ మండల కేంద్రంలో రేణుక రైసుమిల్లులోకి వస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. అయితే బియ్యాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేయడానికి పౌర సరఫరాల శాఖాధికారులు చేసిన వ్యవహరం చర్చనీయాంశంగా మారింది.
కేసులన్నీ డ్రైవర్లపైనే నమోదువుతుండడంతో పీడీఎస్ మాఫియా సులువుగా తప్పించుకుంటుంది. ప్రధానంగా మిల్లర్లు సీఎంఆర్ కోసం రీసైక్లింగ్ బియ్యంగా రేషన్ వాడుతున్న విషయం తెల్సిందే. చాలా మట్టుకు రైసుమిల్లులు బహిరంగంగా రేషన్ బియ్యాన్ని కొంటున్న విషయం తెల్సిందే. ఈ విషయం పౌర సరఫరాల శాఖకు సమాచారం ఉన్న వారు సీఎంఆర్ రీకవరి కోసం రీసైక్లింగ్ బియ్యం వాడుతున్నా పట్టించుకోకపోవడం వెనుక అధికారుల అక్రమార్జన ఆధారపడి ఉంది. ప్రధానంగా డీటీలు చాలా మంది మిల్లర్లతో మిలాఖత్ అయి అధికారులకు ముడుపులు పంపుతున్నారని అందుకే రీకవరి అలసత్వం వహించినా, నోటీసులు ఇచ్చినా పట్టించుకోరనే ఆరోపణలున్నాయి. ఇప్పటి వరకు మిల్లర్లపై కేసుల దాఖలు కానీ జరిమానాలు కానీ విధించినట్లు ఎక్కడ లేదు. రేషన్ బియ్యాన్ని సేకరించి తీసుకువచ్చినవారే బహిరంగంగా అమ్ముతున్నారని కేసులవ్వడమే అందుకు నిదర్శనం. పోలీసు శాఖను స్టేషన్ ల వారిగా వస్తున్న మామూళ్ళతో బియ్యం తరలిస్తున్న లారీ యజమాని కానీ, కొనుగోలు చేస్తున్న మిల్లర్లపై కేసులు నమోదుకావని కేవలం డ్రైవర్లపై కేసు నమోదు కావడమే అందుకు నిదర్శనమని చర్చ జరుగుతుంది.
