24.1 C
Hyderabad
Monday, August 3, 2026

కాంగ్రెస్ లో అంతా పైరవీల కాలమేనా

Must read

📰 Generate e-Paper Clip

  • కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ నేత ఎంపికలో హై డ్రామా..!
  • కొత్త ( చిన్న) నేత కు బడా పదవి..!
  • స్థానిక ఎన్నికలలో సహాయ నిరాకరణకు  సీనియర్ల నిర్ణయం 
  • భవిష్యత్తులో పార్టీ తగిన మూల్యం చెల్లిస్తుంది అంటున్ననేతలు..!

కామారెడ్డి, బతుకమ్మ : కాంగ్రెస్ జిల్లా అధ్యక్షునిగా ఏలే మల్లిఖార్జున్ నియామకం కామారెడ్డి లో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. కాంగ్రెస్ పార్టీలో సీనియర్లను కాదని పార్టీలో కొత్తగా చేరిన ఓ కాంట్రాక్టర్ కు పదవిని దారాదత్తం చేశారని ఆ పార్టీ వర్గాల్లో ఆగ్రహం వ్యక్తం అవుతోంది. జిల్లా నుండి ఢిల్లీ వరకు పైరవీ పని చేసిందని ఆ పదవిని ఆశించి భంగపడ్డ నేతలు బహిరంగంగా విమర్శిస్తున్నారు. జిల్లాలో ఎంపిపి, జడ్పీటిసి సహా వివిధ హోదాల్లో పనిచేసిన సీనియర్లు  ఉన్నారని, దశాబ్దాల కాలంగా ఆ పార్టీలో ఉన్నా లాభం లేకపోయిందని మరికొందరు సీనియర్లు మండి పడుతున్నారు. నిజానికి జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక కోసం ఆ పార్టీ నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది. అసలు రాష్ట్రానికే సంబంధం లేని నేతలను పరిశీలకులు గా పంపి ఆశావహుల నుండి నామినేషన్ లను తీసుకుంది. అంతటితో ఆగకుండా బ్లాక్ కాంగ్రెస్, ఇతర ముఖ్యనేతల అభిప్రాయాలను తీసుకుంది. ఇక్కడే పార్టీ క్యాడర్ తమకు న్యాయం జరుగుతుందని ఆశించారు. నిజానికి అప్పటికే కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి కి బేరం అయిపోయిందని, ఓ ఎమ్మెల్యే భారీగానే కమిట్ అయ్యారని ప్రచారం జరిగింది. అయితే పార్టీ ప్రజాస్వామ్య బద్దం గా క్యాడర్ కు ప్రాధాన్యత ఇస్తున్నట్లు కలరింగ్ ఇవ్వడం తో ఆ పైరవీలకు కాలం చెల్లినట్లు వారు సంబరపడ్డారు. ఎమ్మెల్యే స్థాయి ప్రయత్నాలు ఫలించక తమ గోడు విన్న నేతలు తమ అభిప్రాయానికి మొగ్గు చూపుతారని భావించారు. అందుకు మాలో ఎవరిని ఎంపిక చేసినా పర్వాలేదని చెబుతూనే ప్రజాప్రతినిధి సిఫారసు ప్రకారం ఎంపిక చేస్తే పార్టీ నష్ట పోతుందని తేల్చి చెప్పారు. పిసిసి అధ్యక్షులు మహేష్ గౌడ్ కు సైతం ఇదే విషయాన్ని వివిధ మార్గాల్లో చేరవేశారు.

  • సీనియర్ల ఆశలపై నీళ్ళు చల్లిన ఎఐసిసి..

కామారెడ్డి డీసీసీ పదవి కోసం చాలా మంది ఆశవాహులు హార్డ్ కోర్ కాంగ్రెస్ వాదులు ఆశలు పెట్టుకున్నారు. అయితే వారి ఆశలను వమ్ము చేస్తూ జిల్లాకు చెందిన ఓ ప్రజాప్రతినిధి మాత్రం తన ప్రయత్నాన్ని ముమ్మరం చేయడం తోపాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ప్రసన్నం చేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో నామినేటెడ్ పదవి ఆశించి భంగపడి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునిగా కొనసాగాలని భావించిన కైలాస్ శ్రీనివాస్ రావు తో పాటు మాజీ జెడ్పీ ఫ్లోర్ లీడర్ మోహన్ రెడ్డి, మాజీ ఎంపిపి పండ్ల రాజుపార్టీ కామారెడ్డి మండల అధ్యక్షులు గూడెం శ్రీనివాస్ రెడ్డిపార్టీలో వివిధ హోదాల్లో పనిచేసిన మహేందర్ రెడ్డిమాజీ కౌన్సిలర్ పంపరి శ్రీనివాస్, ఎల్లారెడ్డి కి చెందిన సీనియర్ నాయకులు లింగాగౌడ్మాజీ ఎంపిపి ఆకుల శ్రీనివాస్ బాన్సువాడ కు చెందిన సీనియర్ నాయకులు రాజిరెడ్డి వీరితో పాటు జిల్లాలో అనేక మంది ఆ  పదవి పై ఆశలు పెట్టుకోగా అధిష్టానం నిర్ణయం తో విస్తుపోయారు. వీరిలో కైలాస్ శ్రీనివాస్ రావు కు కాంగ్రెస్ లో జరుగుతున్న అన్యాయం పై తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతుండటం గమనార్హం.

  • పార్టీని నమ్ముకున్న లీడర్లకు ఏది గుర్తింపు..?

కామారెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ గా చైర్మెన్ గా పనిచేసిన కైలాస్ శ్రీనివాస్ రావు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా పార్టీ నీ వీడలేదన్న గుర్తింపు ఉంది. ఆ పార్టీ విద్యార్థి రాజకీయాల తో పాటు వివిధ హోదాల్లో పనిచేసిన ఆయన బిఆర్ ఎస్ నుండి అనేకసార్లు వచ్చిన ఒత్తిడికి తలొగ్గకపోగా కాంగ్రెస్ ను వీడలేదన్న గుర్తింపు ఉంది. కామారెడ్డి లో సుదీర్ఘ కాలం పార్టీ ఓటమి పాలైనా కైలాస్ కాంగ్రెస్ లోనే కొనసాగారు. షబ్బీర్ అలీ ముఖ్య అనుచరుడిగా ఆయనకు గుర్తింపు రాగా పార్టీ అధికారం లోకి వచ్చినా న్యాయం జరగడం లేదన్న చర్చ జరుగుతోంది. మరో నేత మోహన్ రెడ్డి రామారెడ్డి మండలం జడ్పీటిసి గా జెడ్పీ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ గా పనిచేసి అప్పటి అధికార పార్టీని ధీటుగా ఎదుర్కొన్నారు . బిఆర్ యస్ అధినేత కూతురు కవిత ఎమ్మెల్సీ గా పోటీ చేసిన సందర్భం లోను ప్రలోభానికి గురి కాకపోగా కాంగ్రెస్ పార్టీ జెండా వీడక మొండిగా ఎదుర్కొన్నారు అన్న గుర్తింపు ఉంది. అలాంటి మోహన్ రెడ్డి కి సైతం గుర్తింపు దక్కలేదని విమర్శ విన్పిస్తోంది. మరో నేత పోసానిపేట్ మహేందర్ రెడ్డి కాగా ఆయన ది కాంగ్రెస్ లో విషాద గాథ గా చర్చ జరుగుతోంది.ఎల్లారెడ్డి కామారెడ్డి నియోజక వర్గాల్లో ఎటూ కానీ నేత గా మిగిలిపోతున్నారు. నిజానికి కాంగ్రెస్ కు నిఖార్సు అయిన నేతగా గుర్తింపు ఉంది . ఎల్లారెడ్డి లో కాంగ్రెస్ జెండా ఎగరాలని సంకల్పం తో పోరాడిన ఈ మాజీ సర్పంచ్ కాంగ్రెస్ తీవ్రవాది అంటూ ప్రచారం ఉంది. నిఖార్సైన కాంగ్రెస్ నేత గా గుర్తింపు ఉన్న ఆయనకు పార్టీలో ఉన్న సీనియార్టి కలిసి రాలేదు.సదాశివ నగర్ మాజీ ఎంపిపి పండ్ల రాజు ది ఇదే పరిస్థితి. పార్టీలో ఫైటర్ గా పేరు గాంచిన ఆయన టిడిపి అధికారం లో ఉన్న సమయం నుండి ఆ పార్టీలను ఎదిరిస్తూ  క్యాడర్ కు దైర్యం గా నిలిచారు. కరాటే ఫైటర్ గా ఆయనకు ఉన్న గుర్తింపు ప్రత్యక్ష పోరాటం లోనూ కాంగ్రెస్ కు లభించినా పదవుల సాధన లో కలిసిరాలేదు. సుదీర్ఘ కాలం కాంగ్రెస్ కామారెడ్డి లో గెలవక పోగాఅధికార పక్షం నుండి వచ్చిన ప్రలోభాలకు లొంగక కాంగ్రెస్ నే నమ్ముకొని కొనసాగారు. పార్టీ అధికారం లోకి రాగానే ఆయనకూ మొండి చేయి తప్పలేదు. మరో నేత పంపరి శ్రీనివాస్ ది ఫెయిల్యూర్ స్టొరీ కావడం గమనార్హం . మాచారెడ్డి కాంగ్రెస్ కు పునాది వేసేలా కష్ట పడుతూ వచ్చిన ఆయనకు స్థానిక నాయకత్వం రూపం లో తిప్పలు తప్పలేదు. పార్టీ గెలవగానే ప్రతిపక్షం లో ఉన్న బడా నేత పార్టీ పంచన చేరడంఆయనకే ప్రాధాన్యత ఇస్తూ రావడం పరిపాటిగా మారిందన్న వాదన ఉంది.

  • చక్రం తిప్పిన మధన్ మోహన్..

కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఎంపికలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మధన్ మోహన్ చక్రం తిప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ల కేటాయింపులో పై చేయి సాధించిన మధన్ షబ్బీర్ ఆలీకి డీసీసీ ఎలక్షన్ లోనే చెక్ పెట్టారని చెప్పాలి. షబ్బీర్ అలీ ని దెబ్బ కొట్టాలని భావించిన ఎమ్మెల్యే మధన్ మోహన్ రావు డి సిసి ఎంపికలో జుక్కల్ ఎమ్మెల్యే తో చేతులు కలిపి తన క్యాడర్ జుక్కల్ అభ్యర్థి పేరు చెప్పేలా ప్లాన్ వేసినట్లు తెలిసింది. అప్పటికే ఢిల్లీ వరకు ఆ అభ్యర్థి పేరు సిఫారసు చేయగా పరిశీలకుడు రావడం కొంత ఇబ్బందిని కలిగించింది. అయితే జుక్కల్ నేత పేరు ప్రతిపాదన ఆయన క్యాడర్ కు నచ్చక పోగా  అసంత`ప్తి వ్యక్తం అవుతుంది. తమకు న్యాయం చేయాలని వారు పార్టీ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అయినా వారెవరికీ అవకాశం రాకపోగా ఎన్నికల సమయం లో పార్టీలో చేరి న వ్యక్తి కి వెంటనే పార్టీ మండలజిల్లా స్థాయి పదవులు కట్ట బెట్టడం ఏమిటని సీనియర్లు గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. తమకు ఇవ్వని పక్షం లో ఇతర జిల్లాల్లో కేటాయించినట్లు జిల్లా లోని సీనియర్లు లేదా ఎమ్మెల్యేలకు అవకాశం ఇచ్చినా పార్టీ కి మేలు జరిగేది అన్న వాదన వినిపిస్తోంది. స్థానిక సమరం కు ముందు జరిగిన ఈ పరిణామాలు ఆ పార్టీ పై ఎలాంటి ప్రభావం చూపుతాయన్నది తేలాల్సి ఉంది.

  • షబ్బీర్ ఆలీకి గడ్డుకాలమేనా..?

గతంలో జరిగిన యువజన కాంగ్రెస్ ఎన్నికల్లో కొడుకును గెలిపించుకోలేని మాజీ మంత్రి షబ్బీర్ ఆలీ ప్రభావం కాంగ్రెస్ పార్టీలో నానాటికి తగ్గుతుంది. డీసీసీ అధ్యక్షుల ఎన్నికల్లోనూ ఆయన సిఫారసులు చెల్లేలేదు. కాంగ్రెస్ పార్టీలో తిరుగులేని నేతగా గుర్తింపు సాధించిన మాజీ మంత్రి ప్రస్తుత ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ సిఫారసు విఫలం కావడం పై ఆసక్తి కర చర్చ జరుగుతోంది. మరో వైపు ఎంపి షెట్కార్ అభిప్రాయానికి విలువ లేకుండా పోయిందన్న వాదన వినిపిస్తోంది. పార్టీలో చేరి కనీసం అయిదేళ్ళు లేని వారికి పదవులు ఇవ్వలేమని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి చేసిన ప్రకటన సైతం అభాసుపాలు కావడం ప్రధాన అంశం గా మారింది. పార్టీ మారి వచ్చిన వారికే పార్టీ నాయకత్వం గులాం గా మారిందన్న ఆందోళన ప్రధనంగా కనిపిస్తోంది. మరో వైపు కాంగ్రెస్ జిల్లా అధ్యక్ష పదవి ఎంపిక కాంగ్రెస్ కన్నా బిజెపిబి ఆర్ ఎస్ వర్గాల్లో సంబరాలకు దారి తీసినట్లు సమాచారం . మాజీ ఎమ్మెల్యే హన్మంతు షిండే శిభిరం లో వేడుకలు జరిగినట్లు తెలుస్తోంది. మరోవైపు బిజెపి నేత మాజీ ఎంపి బిబి పాటిల్ వర్గాల్లోనూ వేడుకలు జరిగినట్లు సమాచారం . మొత్తానికి కాంగ్రెస్ అగ్ర నేతలు వేసిన తప్పటడుగు  వల్ల జిల్లాలో కాంగ్రెస్ తగిన మూల్యం చెల్లిస్తుందన్న వాదన బలంగా వినిపిస్తోంది.ఇదిలా ఉంటే పార్టీలో పదవుల పంపకం లో పెద్ద ఎత్తున బేర సారలు జరిగాయని ఆ పార్టీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఆ కారణం గానే కొత్తగా చేరిన నేతలకు పార్టీ నియమాలునిబంధనలు అడ్డురాకపోగ అందలం ఎక్కుతున్నారు అంటూ బాహాటంగా నే విమర్శలు చేస్తున్నారు.

More articles

Latest article