నాగిరెడ్డి పేట్, బతుకమ్మ : నాగిరెడ్డిపేట మండలంలోని బంజారా తండా కు చెందిన దారావత్ అంబ్రా నాయక్ అనే వ్యక్తికి చెందిన బోరు బావిలో వర్షాలు బాగా పడడంతో బోరు బావి నుండి నిరంతరంగా నీరు పొంగిపొర్లుతోంది. ఈ దృశ్యం స్థానిక ప్రజలను ఆశ్చర్యానికి గురి చేస్తుండగా, కొందరు రైతులు దీన్ని దేవుని దయగా భావిస్తున్నారు. ఇటీవలి కాలంలో వర్షాలు సమృద్ధిగా కురవడంతో భూగర్భ జలాలు పెరగి, కొన్ని ప్రాంతాల్లో బోరు బావులలో నీటి ఒత్తిడి పెరిగింది. అందువల్ల ఆ బావి కేసింగ్ పైభాగం నుంచి నీరు బలంగా బయటకు పొంగిపొర్లుతోంది. ఇప్పటివరకు ఇలా బోరు నీరు పొంగడం చూడలేదు.. గత కొన్నేళ్లుగా భూమి ఎండిపోయింది.. కానీ ఈ సంవత్సరం వర్షాలు బాగా పడ్డాయి.. నీటి మట్టం పెరగడంతో ఈ బోరు నుంచి రోజంతా నీరు వస్తోంది.. రైతులు ఆనందం వ్యక్తం చేశారు. కొంతమంది పొలాల్లో నీరు నిలవడంతో పంటలు మునిగిపోయాయి. కానీ భవిష్యత్తులో నీటి కొరత ఉండదనే నమ్మకం కలుగుతోంది అని అన్నారు.
