- 14 మంది అధికారులు, సిబ్బంది బదిలీ
- అసాంఘీక కార్యకలపాల నిర్వాహకుల నుంచి వసూళ్లే కారణమా..?
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : పోలీస్ కమిషనరేట్ పరిధిలో అసాంఘీక కార్యకలపాలకు సింహ స్వప్నంలా ఉండే టాస్క్ ఫోర్స్ లో పనిచేస్తున్న అధికారులు, సిబ్బందిని ఉన్నపలంగా బదిలీ చేశారు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య. పోలీస్ కమిషనరేట్ ఏర్పడిన తరువాత టాస్క్ ఫోర్స్ లో ఒక్కరు కూడా అధికారి గాని, సిబ్బంది గాని లేకుండా ఉండటం ఇదే మొదటి సారి కావడం పోలీస్ శాఖలో చర్చనీయాంశంగా మారింది. ఈ మేరకు సోమవారం టాస్క్ ఫోర్స్ లో పనిచేస్తున్న సిఐ అంజయ్యను సీసీఆర్బీకి బదిలీ చేశారు. ఎస్సై గోవింద్ను ఆర్మూర్కు, మరో ఎస్సై శివరాంను సీసీఆర్బీకి అటాచ్ చేశారు. సిబ్బంది యాకుబ్ రెడ్డిని సీసీఆర్బీకి, లస్మన్నను భీమ్గల్ పీఎస్కు, సుధీర్ను రెంజల్ పీఎస్కు, అనిల్ కుమార్ను సీసీఎస్కు, రాజును బోధన్ టౌన్కు , సచిన్ను భీమ్గల్కు, అన్వర్ను బోధన్ టౌన్కు, అనిల్, శ్రీనివాస్, ఎన్.సచిన్, సాయినాథ్లను ఏఆర్ హెడ్క్వార్టర్స్కు అటాచ్ చేశారు. సత్వరమే ప్రస్తుత స్థానం నుంచి రిలీవ్ కావాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. గతంలో పనిచేసిన ఎసిపి విష్ణూమూర్తిపై తీవ్ర అరోపణలు రావడంతో సస్పెండ్ చేశారు గత ఎడాది అక్టోబర్ మాసంలో. ఆనాటి నుంచి సిసిఎస్ ఎసిపి నాగేంధ్రచారీ ఇంచార్జీగా వ్యవహరిస్తున్నారు. నిజామాబాద్ టాస్క్ ఫోర్స్ వ్యవహరంపై విమర్శలు వస్తున్నాయి. ఏళ్ల తరబడి అక్కడ పాతుకుపోయిన వారు పత్తాలాట, మట్కా, ఆన్ లైన్ గేమింగ్, పీడీఎస్ దందా నిర్వహకులు మొదలుకొని, గంజాయి స్మగ్లర్ ల వరకు మామూళ్లు తీసుకొని పట్టుకోవడం లేదని ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల పోలీస్ బాస్ నిఘాలో ఈ విషయం వెల్లడైంది. అంతే గాకుండా పోలీస్, టాస్క్ ఫోర్స్ లు ఫోర్స్ గా పనిచేయడం లేదని పోలీస్ బాస్ కు ఫిర్యాదులు రావడంతో మొత్తంగా ఉన్న సిబ్బందిని బదిలీ చేసి రిలివ్ చేయడంతో పాటు వెంటనే విధులలో చేరాలని ఆదేశాలు జారీ చేయడం కలకలం రేపుతుంది. టాస్క్ ఫోర్స్ లో మొత్తం కొత్తవారిని నియమించి ప్రక్షాళన చేసేందుకు బదిలీ అస్త్రం ప్రయోగించారనే చర్చ జరుగుతుంది.
