- పెండింగ్ సమస్యలు పరిష్కరిస్తే రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తాం
- రెండు క్యాడర్ల పెంపు, ఐదు పెండింగ్ ఇంక్రిమెంట్స్ విడుదల & కారుణ్య నియామకాలు ఇందిరా మహిళా శక్తి సంబరాల్లోనే వర్తింపచేయండి
- రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కి సెర్ప్ ఉద్యోగ సంఘాల స్టేట్ జేఏసీ లేఖ
హైదరాబాద్, బతుకమ్మ: నేటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇందిరా మహిళా శక్తి సంబరాలలో మహిళా సంక్షేమమే లక్ష్యంగా గత 25 సంవత్సరాలుగా శ్రమిస్తున్న సెర్ప్ సిబ్బందికి కూడా పెండింగ్ సమస్యలు పరిష్కరించి సిబ్బంది కుటుంబాల్లో సంబరాలను జరుపుకునేలా రాష్ట్ర ప్రభుత్వం కరుణించాలని తెలంగాణ సెర్ప్ ఉద్యోగ సంఘాల స్టేట్ జేఏసీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కి విన్నవించింది. తమకు గతంలో పేస్కేల్ వర్తింప చేసినప్పటికీ రెండు కేడర్లు తగ్గించి వర్తింప చేసారని దీంతో తీవ్రంగా నష్టపోయామని పేర్కొన్నారు. పే స్కేల్ వర్తింపచేసినప్పటికీ ఇంతవరకు సర్వీసు రూల్స్ తయారీ కాలేదని వ్యక్తిగత నియామక పత్రాలు అందజేయలేదని కాబట్టి మొత్తం 3974 సిబ్బందికి రెండు కేడర్లు పెంచి పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖలోని సర్వీస్ రూల్స్ ను యధావిధిగా వర్తింపజేసి వ్యక్తిగత నియామక పత్రాలను అందజేయాలని కోరారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో 1386 సిబ్బందికి 6% వార్షిక ఇంక్రిమెంట్ మంజూరు చేయలేదని, 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 6% ఇంక్రిమెంట్ మొత్తం 3974 సిబ్బందికి బకాయి ఉందని అన్నారు. అలాగే పే స్కేలు వర్తింప చేసిన తర్వాత సహజంగా రావలసిన 2023-24, 2024-25 & 2025-26 మూడు వార్షిక సంవత్సరాల పేస్కేల్ ఇంక్రిమెంట్స్ కూడా విడుదల కాలేదన్నారు. సంబంధిత ప్రతిపాదనలు ఇదివరకే ఆర్థిక శాఖకు చేరినందున వెంటనే విడుదల చేయాలని కోరారు. గత 25 సంవత్సరాలుగా పేదరిక నిర్మూలన, మహిళా సంక్షేమమే లక్ష్యంగా ఆహోరాత్రులు శ్రమిస్తున్న సెర్ఫ్ సిబ్బందిలో ప్రస్తుతం 80% పైగా సిబ్బంది 50 సంవత్సరాల పైబడ్డ వయస్సు తో ఉన్నారని, చాలీచాలని వేతనాలతో కుటుంబ భారాన్ని మోస్తూ తరచూ సిబ్బంది విధి నిర్వహణలో మరణిస్తున్నారని వెల్లడించారు. ఇంతకాలం కుటుంబానికి పెద్దదిక్కుగా ఉన్న ఉద్యోగి మరణించడంతో ఆ ఉద్యోగి కుటుంబం వీదిన పడుతోందని దీనిని నివారించేందుకు కారుణ్య నియామకాలు చేపట్టాలని కోరారు. పై మూడు అంశాలకు సంబంధించి ఇదివరకే గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి విన్నవించగా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత సానుకూలంగా స్పందించిందని, సంబంధిత అంశాలతో కూడిన స్టేట్ జేఏసీ లెటర్ ను సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు ఎండార్స్ చేసి సెర్ప్ సీఈఓ గారికి తగిన ప్రతిపాదనల కోసం పంపించడం జరిగిందని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంక్షేమంతో పాటు సెర్ప్ సిబ్బంది పట్ల కూడా అత్యంత సానుకూలంగా ఉండడంతో , ఇందిరా మహిళా శక్తి కింద రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన అన్ని కార్యక్రమాలను అత్యంత విజయవంతంగా అమలు చేసేందుకు క్షేత్ర స్థాయిలో సెర్పు సిబ్బంది కష్టపడుతున్నారని గుర్తు చేశారు. ఇందులో భాగంగా ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ల ఏర్పాటు, ఆదాయ అభివృద్ధి కార్యక్రమాలకు గత ఆర్థిక సంవత్సరంలో 20,000 కోట్ల రూపాయల రుణాల పంపిణీ చేయడం, 98.5% రికవరీ సాధించడం, పెట్రోల్ బంకుల ఏర్పాటు వంటి వివిధ రకాల కార్యక్రమాల అమలులో సెర్ఫ్ సిబ్బంది పాత్ర అత్యంత కీలకంగా ఉన్న సంగతిని గుర్తు చేశారు. అంతే కాకుండా చరిత్రాత్మకంగా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను అత్యంత విజయవంతంగా నిర్వహించడం జరిగిందని వివరించారు. పైన పేర్కొన్నట్లుగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి సెర్ప్ ఉద్యోగ సంఘాల స్టేట్ జేఏసీ తరఫున జూన్ 2024 లో ఇచ్చిన వినతి పత్రాన్ని ఎండార్స్ చేసి పంపగా సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్ ఐఏఎస్ గారు సెర్ప్ సిబ్బంది రెండు కేడర్ల పెంపు కొరకు అయ్యే ఆర్థిక వనరుల వివరాలు సంబంధిత చేపట్టిన చర్యలపై అధికారికంగా ప్రతిపాదనలను పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ గారికి అధికారికంగా పంపించడం జరిగిందని స్పష్టం చేశారు. దీనికి స్పందించిన పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా సెర్ప్ సిబ్బంది రెండు కేడర్ల పెంపుకు సంబంధించిన ప్రతిపాదనలను ఆర్థిక శాఖకు ఇదివరకే పంపడం జరిగిందని పేర్కొన్నారు. అదేవిధంగా సెర్ప్ సంస్థలో కారుణ్య నియామకాలు చేపట్టేందుకు అవసరమైన అంశాలపై సెర్ప్ సీఈవో గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఇదివరకే ఆర్థిక శాఖకు తగిన ప్రతిపాదనలు పంపడం జరిగిందని పేర్కొన్నారు. అదేవిధంగా పైన పేర్కొన్న ఐదు ఇంక్రిమెంట్లకు సంబంధించిన ప్రతిపాదనలను సైతం సెర్ప్ సీఈఓ పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఆర్థిక శాఖకు పంపడం జరిగిందని వివరించారు. పై మూడు ఫైల్లు అధికారిక ప్రతిపాదనలతో వెళ్లడానికి సెర్ప్ సిబ్బంది పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న సానుకూల వైఖరికి నిదర్శనమని పేర్కొన్నారు. ఈ మూడు ఫైల్లు ప్రస్తుతం ఆర్థిక శాఖలో ఉన్నాయని కావున రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రివర్యులు ప్రత్యేకంగా చొరవ తీసుకొని సెర్ప్ సిబ్బందికి సంబంధించి మూడు ప్రధాన డిమాండ్లలో మొదటిది అయిన- సిబ్బంది రెండు కేడర్ల పెంపు, సర్వీస్ రూల్స్ పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖతో సమానంగా అమలు చేస్తూ వ్యక్తిగత నియామక పత్రాలు జారీ చేయాలని, రెండవ అంశం అయిన ఐదు పెండింగ్ ఇంక్రిమెంట్లను విడుదల చేయాలని,మూడవ అంశం అయిన కారుణ్య నియామకాలను వర్తింపజేయాలని కోరారు.ఈ మూడు అంశాలు ఈనెల 16వ తేదీ లోపు మహిళా శక్తి సంబరాలు ముగిసే లోపే అమలుచేసి సెర్పు సంస్థలో 50 లక్షల మహిళల సంక్షేమమే లక్ష్యంగా కృషి చేస్తున్న 3974 సిబ్బందికి వర్తింప చేయాలని తెలంగాణ సెర్ప్ ఉద్యోగ సంఘాల స్టేట్ జేఏసీ నాయకులు కుంట గంగాధర్, ఏపూరి నరసయ్య, మహేందర్ రెడ్డి, మహేష్, సురేఖ సుదర్శన్ చెన్నయ్య, యాదగిరి, వెంకట్, రాజారెడ్డి, జానయ్య ఉప ముఖ్యమంత్రి ని విజ్ఞప్తి చేశారు.

