అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్
నిజామాబాద్, బతుకమ్మ : నగరంలో నెలకొన్న సమస్యలను దశలవారీగా త్వరలో పరిష్కరిస్తామని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ అన్నారు. 8 వ డివిజన్ పరిధిలోని లలిత నగర్, సాయిరాం నగర్, సాయి నగర్ కాలనీలో ఎమ్మెల్యే ధన్ పాల్, మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ తో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతు గత ప్రభుత్వం 10 ఏళ్ల నిర్లక్ష్యం కారణంగా ఇందూర్ నగరం సమస్యల వలయంగా మారిందన్నారు. వర్షాకాలంలో ఎనిమిదో డివిజన్ లో రోడ్లు, డ్రెయినేజీ సమస్య కారణంగా ప్రజలు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొకుండా చర్యలు తీసుకోవాలన్నారు. వర్షాకాలం రాకముందే బీటీ రోడ్స్, సీసీ రోడ్స్, లింక్ రోడ్ల నిర్మాణాలు చేపట్టాలని, డ్రెయినేజీ కాలువల నిర్మాణం, అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ పనులు పూర్తి చేయాలని కమిషనర్ కి సూచించారు. నగరంలో ఇప్పటికే డ్రెయినేజీ సమస్య పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వ నిధులతో అమృత్ – 2 కింద అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ పనులు ప్రారంభమయ్యాన్నారు. ఎలక్ట్రిక్ స్తంభాలు, వీధి దీపాలు అవసరం ఉన్న చోట త్వరగా ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. డివిజన్ వాసులకు ఆహ్లాదకరమైన పార్క్, ఓపెన్ జిమ్ తో కూడిన నిర్మాణం చేపట్టాలని సూచించారు. వీధుల్లో కోతులు, కుక్కల బెడద ఎక్కువగా ఉందని స్థానికులు ఎమ్మెల్యేకి విన్నవించారు. స్పందించిన ఎమ్మెల్యే తగిన చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ కు సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఈఈ మురళి మోహన్ రెడ్డి, అడిషనల్ మున్సిపల్ కమిషనర్ జయకుమార్, ఏఈ భూమేష్, బీజేపీ నాయకులు మఠం పవన్,నాగరాజు అంబాదాసు,బుస్సాపూర్ శంకర్, చంద్రశేఖర్, సాగర్ తదితరులు పాల్గొన్నారు.
