27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

పాలు నాసిరకం.. నాణ్యత లోపం..

Must read

📰 Generate e-Paper Clip

  • ల్యాబ్ లో బంధుప్రీతి, ప్రమాణాలకు తిలోదకాలు
  • సంస్థ నడవడంపై సందేహాలు

 

నిజామాబాద్, బతుకమ్మ:

ప్రజలలో ‘విజయ’ నమ్మకమైన బ్రాండ్. దానిని తుంచివేయడానికి ఉద్యోగులు నమ్మక ద్రోహం చేస్తున్నట్లు తెలుస్తోంది. సర్కారు నుంచి జీతాలు తీసుకొని ప్రైవేటు వారితో కుమ్మక్కై ప్రభుత్వామోదితమైన విజయ డెయిరీకి నామాలు పెట్టేందుకు సిద్దమవుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. విజయ పాలు బాగాలేవని తీసుకున్న వినియోగదారులు డెయిరీ అధికారుల మొహం మీదే చెప్పేస్తుండడంతో సంస్థను ఉంచుతారా.. ముంచుతారా అనే సందేహాలు జిల్లా వాసుల్లో కలుగుతున్నాయి.

  • పాలు నాసిరకం..

నిజామాబాద్ మిల్క్ షెడ్ కు వచ్చే పాలు భారీగా తగ్గిపోయాయి. దీంతో గత్యంతరం లేక పక్క జిల్లా నుంచి తెప్పించుకుంటున్నారు. అడుక్కొని తెచ్చుకున్న పాలు నాణ్యతగా ఉన్నాయా ..లేవా అని ల్యాబ్ లో పరీక్షలు జరపాల్సి ఉంటుంది. డెయిరీ ప్రమాణాలు పాటించకుండానే పాలను వినియోగదారులకు అంటగడుతున్నారు. వీటిని ఉపయోగించుకున్న వారు చీ అంటూ చీత్కరిస్తున్నారు. పక్క జిల్లా నుంచి తెప్పిస్తున్న పాలు చెడుగా కనిపిస్తున్నాయని, వీటిని పాకెట్ల రూపంలో తీసుకున్న వినియోగాదారుల నుంచి చివాట్లు వస్తాయని అందులోని సిబ్బంది చెప్పినా, శాశ్వత ఉద్యోగులు పెడచెవిన పెడుతున్నారని సమాచారం.

  • నాణ్యత లోపం..

నిజామాబాద్ లోని విజయలో నాణ్యత లోపం కొట్టొచ్చినట్లు కనబడుతోంది. ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలకు పంపిణి చేసిన పాలు లోపభూయిష్టంగా ఉన్నట్లు ఫిర్యాదులు వెళ్లాయని తెలిసింది. గురుకులాల్లో మిగిలిన పాలను పెరుగుగా మార్చేందుకు ప్రయత్నాలు చేస్తే బెడిసి కొట్టాయని సమాచారం. నిజామాబాద్ బస్ స్టాండ్ లో ఉన్న దుకాణంలో విజయ మజ్జిగ కొని తాగిన వారు వా ..క్తు అని ఉమ్మేసి ఏంటి ఇంత పులుపు ఉందని ప్రశ్నించినట్లు తెలిసింది. నాణ్యతపై ఇన్నేళ్ళుగా రాని ఫిర్యాదులు ఇటీవల ఎక్కువవుతున్నాయి. దీనిని అధికారులు సంస్కరించాల్సి ఉండగా నిమ్మకు నిరేత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇది ఇలానే కొనసాగితే డెయిరీ ఉంటుందా.. ఊడుతుందా అనే అనుమానాలు పొడసూపుతున్నాయి.

  • 96547

మిల్క్ షెడ్ లోని ల్యాబ్ లో బంధు ప్రీతి నడుస్తోంది. అసలు కన్నా కొసరు ముద్దు అన్నట్లుగా ల్యాబ్ కు సంబందించిన ఉద్యోగిని కాదని, తాత్కాలిక సిబ్బంది పెత్తనం ఉండేలా శాశ్వత ఉద్యోగులు చూడడం విమర్శలకు తావిస్తోంది. వీరి నిర్వాకం వల్ల పాలల్లో, పెరుగులో, మజ్జిగలో నాణ్యత తగ్గిపోతుంది. ల్యాబ్ లో ఒక అధికారి తన రక్త సంబంధీకులను పెడితే, మరొకరు తన సామజిక వర్గానికి చెందిన వారిని నియమించుకున్నారు. దీంతో అసలు ఉద్యోగిని పక్కకు పెట్టినట్లయ్యిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అర్హత లేనివారు పరీక్షలు చేయడంతో ప్రమాణాలు పడిపోతున్నాయి. ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోకపోతే సంస్థ నడవడం గగనమే అవుతుంది.

More articles

Latest article