మాచారెడ్డి, బతుకమ్మ : ఉర్సు పండుగకు వెళుతూ ఒకరు మృత్యు ఒడిలోకి వెళ్లిన ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. మాచారెడ్డి మండలం లోని గజ్యానాయక్ తండా కు చెందిన షేక్ కరీం(45) అనే వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఘటన స్థానికుల ను కలచి వేసింది. కామారెడ్డి లోని నిరంజన్ షావలి దర్గా వద్ద జరుగుతున్న ఉర్సు పండుగ కు వెళ్తున్న శేక్ కరీం ను మంగళవారం డిసిఎం ఢీకొనడంతో అతని రెండు కాళ్ళు విరిగి తీవ్ర రక్త స్రావమైంది. కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి లో ప్రాథమిక వైద్యం అందించారు. పరిస్థతి విషమించడంతో హైదరాబాద్ తీసుకెళ్తుండగా మార్గమద్యలో తుది శ్వాస విడిచాడు. దినసరి కూలీ గా బతుకీడుస్తున్న కరీం ఆకస్మిక మరణం తో అతని కుటుంబం రోడ్డున పడింది. డీసీఎం డ్రైవర్ పోలీసులకు లొంగిపోయాడు. కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.