- శాశ్వత ఉద్యోగి బాటలో తాత్కాలిక సిబ్బంది
- రైతులకు అందుబాటులో లేని ఉద్యోగులు
- విజయ డెయిరీలో నిత్యం ఇదే వ్యవహారం
నిజామాబాద్, బతుకమ్మ: పని వేళలో గాదు ..వారికి తీరిక ఉన్నప్పుడు చుట్టపు చూపుగా వచ్చి వెళ్తున్నారు. సర్కార్ కార్యాలయం, అందులోనూ ఊరికి అవతల ఉంది. ఎప్పుడు వచ్చినా, రాకపోయినా అడిగే వారు లేరు. దీంతో తానే రాజు, తానే మంత్రి అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇదంతా ఎక్కడ అని ఆలోచిస్తున్నారా ..అదేనండీ .. సారంగాపూర్ లో ఉన్న విజయ డెయిరీ గురించే.. ఉదయం 10.25 కు వెళ్లిన ‘బతుకమ్మ’ ప్రతినిధి పరిశీలనలో, 11.15 కు వచ్చిన తాత్కాలిక ఉద్యోగి, ఖాళీ కుర్చీలను ఫోటోలు తీసిన విషయం చేరవేశాడు. కాసేపటికే శాశ్వత ఉద్యోగి రుసరుస లాడుతూ కార్యాలయానికి చేరుకొని, వారిని లోపలికి ఎందుకు రానిచ్చారాని అటెండర్ పై చిందులేసినట్లు తెలిసింది. వీరు సమయపాలన పాటించక, ముందుగా వచ్చిన వారిని దూషించడం ఆ ఉద్యోగికే చెల్లింది.

- మధ్యాహ్నం రాకడ …
ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరు ప్రభుత్వ, ప్రైవేట్ అనే తేడా లేకుండా ఉదయం 10.30 లోపు విధులకు హాజరు కావాల్సి ఉంటుంది. ఇక్కడ మాత్రం మద్యాహ్నం విధులకు వస్తున్నారు. ఇందులో శాశ్వత ఉద్యోగుల కన్నా తాత్కాలికంగా నియమింపబడినవారే అదికంగా ఉన్నారు. పాలనాపరమైన బాద్యతలు మోసేవారు కార్యాలయ సమయాల్లో హాజరై, రానివారి పట్ల కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుంది. శాశ్వత ఉద్యోగియే రానప్పుడు తామెందుకు ముందుగా రావాలని భావించుకొని మెల్లిగా వస్తున్నారు. దీనివల్ల డెయిరీలో పాలన అస్తవస్తంగా మారినట్లు కనబడుతోంది.

- సాయంత్రం పోకడ …
మద్యాహ్నం వస్తారు. అటుఇటు చూసి తెచ్చుకున్న టిఫిన్ తినేందుకు కూర్చుంటారు. సాయంత్రం నాలుగు అవుతున్నప్పటి నుంచే ఇంటికి వెళ్లేందుకు సంసిద్దులై ఉంటారు. ఐదు తర్వాత కార్యాలయ సిబ్బంది ఒక్కరు కనిపించడం లేదు. అంత దూరం ఎవరు రారు, ఆకస్మిక తనిఖీలు ఉండవు. అడిగే వారు లేరు.. ఇంతటి సౌలభ్యం ఉండబట్టే పిక్నిక్ వచ్చినట్లు వస్తున్నారు.

- శాశ్వత ఉద్యోగి బాటలో..
డెయిరీలో శాశ్వత ఉద్యోగులు తక్కువగా ఉండడంతో తాత్కాలిక సిబ్బందిని నియమించారు. వీరిని హద్దులో ఉంచాలంటే శాశ్వత ఉద్యోగి కార్యాలయ సమయానికే రావాల్సి ఉంటుంది. ఒక్కోసారి విధులకు హాజరు గాకపోయినా, హాజరైనట్లు మరునాడు సంతకాలు పెట్టుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. గంతకు తగ్గ బొంత అన్న చందంగా శాశ్వత ఉద్యోగి బాటలో తాత్కాలిక సిబ్బంది నడుస్తున్నట్లు కనబడుతోంది.

- రైతుల పడిగాపులు …
అధికారులను కలిసి సమస్యను విన్నవించుకుందామని వచ్చే రైతులకు పడిగాపులు తప్పడం లేదు. ఎప్పుడు వస్తారో, రారో తెలియని పరిస్థితి. అక్కడున్న వారిని అడిగితే సరైన సమాధానం ఉండక పోవడంతో, ఎదురు చూసి తిరిగి వెళ్లి పోతున్న సంఘటనలు ఉన్నాయి. పనిపై వచ్చేవారికి వేచి చూడడం నిత్యకృత్యమైంది. జీతాలు సమయానికి రాకుంటే గగ్గోలు పెట్టే ఉద్యోగులు, కార్యాలయ వేళల్లో విధులు నిర్వహించాలనే గురుతర బాధ్యతను మరచిపోతున్నారు.
