. . . కాలిగోట వీణకు ఘన సత్కారం, ఆర్థిక సహాయం అందజేత
కామారెడ్డి, బతుకమ్మ :
కామారెడ్డి మండలం గర్గుల్ గ్రామానికి చెందిన ప్రతిభావంతురాలైన యువ క్రీడాకారిణి కాలిగోట వీణ ఇంటర్నేషనల్ స్థాయిలో హాకీ ఆడేందుకు ఎంపిక కావడం గ్రామానికి గర్వకారణంగా నిలిచింది. చిన్న గ్రామం నుండి అంతర్జాతీయ వేదికపై తన ప్రతిభను చాటుకునే అవకాశాన్ని సాధించడం ఆమె కృషి, పట్టుదల, ప్రతిభకు నిదర్శనంగా నిలుస్తోంది. ఈ సందర్భంగా వీణకు అవసరమైన ప్రయాణ, కిట్, ఇతర ఖర్చుల నిమిత్తం గర్గుల్ గ్రామ సర్పంచ్ చింతాల దివ్య రవి తేజ గౌడ్ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రూ. 5,000 నగదు సహాయం అందజేశారు. గ్రామ అభివృద్ధి పట్లనే కాకుండా యువతలో ప్రతిభను ప్రోత్సహించడంలో కూడా తాము ఎల్లప్పుడూ ముందుంటామని ఆయన తెలిపారు. అదేవిధంగా వీణ చదువుతున్న పాఠశాల సిబ్బంది కూడా ఆమె ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తూ రూ. 10,000 ఆర్థిక సహాయం అందజేశారు. ఉపాధ్యాయులు మాట్లాడుతూ, వీణ లాంటి విద్యార్థులు మరెంతో మందికి ఆదర్శంగా నిలుస్తారని, ఆమె అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని వీణకు అభినందనలు తెలిపారు. ఆమె భవిష్యత్తులో దేశానికి, రాష్ట్రానికి పేరు తీసుకురావాలని ఆకాంక్షిస్తూ ఆశీర్వాదాలు అందించారు. గ్రామ స్థాయిలో ఇలాంటి ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి ప్రోత్సహించడం ద్వారా గ్రామ యువతలో క్రీడా స్పూర్తి పెంపొందుతుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు, యువత, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
