సీఎం వార్నింగ్ తో మార్పు వచ్చేనా

0 15,291

 

. . . ఉమ్మడి జిల్లాలో ఇసుక అక్రమ తవ్వకాలు ఆగేనా?

 

. . . అక్రమ రవాణాతో అడ్డుకట్ట పడేనా

 

నిజామాబాద్, బతుకమ్మ :

 

అక్రమ మైనింగ్ పై ఉక్కుపాదం మోపాలని ఇసుక అక్రమ రవాణా జరిగితే కలెక్టర్లే బాధ్యులని సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల  కలెక్టర్ల సదస్సులో వార్నింగ్ ఇచ్చిన విషయం తెల్సిందే. పేరుకు భూగర్భ గనులు (మైనింగ్ శాఖ) ఉన్న ప్రభుత్వానికి ఎలాంటి ఆదాయం రావడం లేదు. కొందరు లీడర్లే నదులతో పాటు వాగులు, వంకలను కుళ్లబోడుస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో మంజిరా, గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఇసుక తవ్వకాలకు అనుమతులు ఉన్నాయి. ప్రభుత్వం ఇటీవల కాలంలో మన ఇసుక వాహనం ఆన్ లైన్ యాప్ ద్వారానే ఇసుక రవాణా చేసుకోవాలని ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెల్సిందే. అయితే సంవత్సరాలుగా ఇసుకను తోడేసే తోడేళ్ళకు అధికార పార్టీ అండ పోలీసులు, మైనింగ్, రెవెన్యూ వెన్నుదన్నుతో ప్రతి యేడాది ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణా అన్నది కొనసాగుతునే ఉంది. ఇటీవల సీఎం వార్నింగ్ ఇవ్వడంతో ఇసుక అక్రమ రవాణాపై జిల్లా అధికార యంత్రాంగం కొరడా ఝళిపించాలని నిర్ణయించింది.

నిజామాబాద్ జిల్లాలో ఇసుక వాహనం యాప్ లో 25 ఇసుక రీచ్ లు ఉన్నాయి. తెలంగాణ మినరల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ద్వారా పట్టా భూముల్లో 8 ప్రాంతాల్లో ఇసుక తవ్వకాలకు అనమతులిచ్చారు. టీఎస్ఎంఐడీసీ ఆధ్వర్యంలో పోతంగల్ మండలంలోని కారేగావ్, హంగర్గ, సుంకిని గ్రామాల్లో అనుమతించిన ఇసుక పాయింట్లు ఉన్నాయి. కానీ వాటిపై చాలా మట్టుకు అధికార పార్టీ పెత్తనమే కొనసాగుతుంది. ఇందిరమ్మ ఇళ్ళ పేరిట, ప్రజల అవసరాల పేరిట, ప్రభుత్వ పనుల కోసమని ఇప్పటికే చాలా ప్రాంతాల్లో ఇసుక తవ్వేసి తరలించారు. తాజాగా కోటగిరి పూర్వమండలం నుంచి పొరుగున ఉన్న మహారాష్ట్రకు ఇసుక అక్రమ రవాణా జరుగుతున్న విషయం విధితమే. ఈ విషయంలో కామారెడ్డి జిల్లాలో అక్రమ రవాణా కేసులు నమోదయ్యాయి. తాజాగా నిజామాబాద్ తో పాటు బోధన్, నవీపేట్ లలో తెలంగాణ మినరల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ద్వారా సాండ్ బజార్ ల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణకు మహారాష్ట్ర నుంచి ఇసుక రవాణా జరిగితే ప్రభుత్వానికి సుంకం చెల్లించి రవాణా చేసుకునేందుకు గాను టీజీఎంఐడీసీ ఇటీవల సాలురా వద్ద తనిఖీ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఇదిలా ఉండగా 25 ఇసుక రీచ్ లు కాకుండా చాలా ప్రాంతాల్లో వాగులు వంకల్లో వీడీసీల పేర్ల మీద ఇసుక రవాణా జరుగుతుంది. ఇందిరమ్మ ఇళ్ళ కోసమని తహసీల్ధార్లు అనుమతించిన పత్రాలను చూపుతూ తవ్వకాలతో డంపింగ్ చేసి రవాణా జరుగుతున్న విషయం విధితమే. ఈ విషయంలో స్థానికంగా పోలీసు శాఖ అడపాదడపా  కేసులు నమోదు చేస్తున్న ఇసుక అక్రమ రవాణా మాత్రం ఆగడం లేదు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంతో పాటు బాల్కొండ నియోజకవర్గం, బోధన్, కోటగిరి పాత మండలం నుంచి కూడా ఇసుక రవాణా ఆగడం లేదు.

 

Will the CM's warning bring any change?

 

కామారెడ్డి జిల్లాలో మంజిరా పరివాహక ప్రాంతాల్లో ప్రభుత్వం ఇసుక రీచ్ లకు అనుమతినిచ్చినా కొన్ని పట్టా భూముల్లో తవ్వకాలకు అనుమతిలిచ్చిన స్థానిక చోటా లీడర్లు దానిని ఆదాయ వనరుగా మార్చుకున్నారు. ట్రాక్టర్లతో ఇసుక తరలింపునకు అనుమతులు ఉండగా తవ్వకాల పేరిట జేసీబీలను వాడుతూ టిప్పర్లను నింపుతున్నారు. ఒక్కో టిప్పర్ కు రూ.4 వేల నుంచి 6 వేల వరకు వసూల్ చేస్తున్నారు. మన ఇసుక యాప్ లో లేబర్ చార్జీలు లేకపోవడాన్ని సాకుగా చూపుతూ ఈ వ్యవహరం నడుస్తోంది. మంజిరా పరివాహక ప్రాంతంతో పాటు వాగులలో ఇదే పరిస్థితి నెలకొంది. బాన్సువాడ, జుక్కల్ నియోజకవర్గంలో ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఉమ్మడి జిల్లాలో ఇసుక రవాణా స్థానిక ఎమ్మెల్యేల అనుచరులే ముందుండి నడుపుతున్నారనే విషయం నిఘా వర్గాలకు తెలుసు. కానీ ప్రతి ఒక్కరికి అందాల్సిన మామూళ్లు అందుతుండడంతో ఈ దందా నిరంతరంగా సాగుతుంది. సీఎం డైరెక్ట్ గా కలెక్టర్ లకే వార్నింగ్ ఇవ్వడంతో తవ్వకాలు, అక్రమ రవాణాకు చెక్ పెడుతుందా అనే చర్చ మొదలైంది.

 

 

Leave A Reply

Your email address will not be published.