28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

పోరాటానికి ప్రస్తుతం విరామం మాత్రమే

Must read

📰 Generate e-Paper Clip

 

. . . బాధితులకు సంపూర్ణ న్యాయం జరిగే వరకు వదలం

 

. . . నిరాహార దీక్ష విరమించిన జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, విశారాదన్ మహారాజ్

 

ఖమ్మం, బతుకమ్మ :

 

పోరాటానికి ప్రస్తుతం విరామం మాత్రమే తీసుకుంటున్నామని, బాధితులకు సంపూర్ణ న్యాయం జరిగే వరకు ఈ సమస్యని వదలమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. వెలుగుమట్ల లో జరుగుతున్న అక్రమణలపై ఆమె నిరాహార దీక్ష చేయగా బుధవారం జస్టిస్ ఈశ్వరయ్య నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ వెలుగుమట్ల లో జరిగిన సంఘటనపై రాష్ట్ర ప్రజలంతా బాధగా ఉన్నారని, అసలు రాష్ట్రంలో ప్రజస్వామ్యం అనేది ఉందా అనే అనుమానం వచ్చే విధంగా అర్థరాత్రి పూట బుల్డోజర్లతో పేదల ఇళ్లు కూల్చేశారని, ఆ తర్వాత బాధితులను అవహేళన చేస్తూ వారికి భూమి మీద హక్కులు లేవంటూ మాట్లాడారని అన్నారు. సంఘటన తర్వాత చాలా పార్టీలు టూరిస్టుల మాదిరిగా బాధితుల వద్దకు వెళ్లారని, కానీ వారి సమస్య పరిష్కారమయ్యే విధంగా పెద్ద ఎత్తున పోరాటం చేయలేదని తెలిపారు. అన్ని అర్హతలు ఉన్న వారి ఇళ్లు కూలగొట్టే అధికారం అసలు ఈ ప్రభుత్వానికి ఎక్కడిదని ప్రశ్నించారు. అన్ని పార్టీల మాదిరిగా కాకుండా సమస్యకు పరిష్కారం కోసం కార్యాచరణ చేయాలని భావించామని, ఆ క్రమంలో ఈ నెల 9 న ఖమ్మంలోని బాధితుల వద్దకు వెళ్లామని, అక్కడ పరిస్థితులను చూస్తే అసలు మనం ఇండియాలో ఉన్నామా లేక అప్ఘనిస్తాన్ లో ఉన్నమా అనే అనుమానం కలిగిందని వాపోయారు. ఖమ్మం లో పెద్ద ఎత్తున ధర్నా చేశామని, ఆ తర్వాత అప్పటికప్పుడు నిరాహార దీక్ష చేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. అయితే పోలీసులు విశారదన్ మహారాజ్ ని, నన్ను అరెస్ట్ చేసి హైదరాబాద్ తరలించారని, పోలీసులు హైదరాబాద్ లో ఎక్కడ మమ్మల్ని వదిలేశారో అక్కడే మేము దీక్ష కొనసాగించామని పేర్కొన్నారు. మీడియా, అధికారులు మా పక్షానే ఉన్నారన్న ధీమాతో ప్రభుత్వం పేదల ఇళ్లు కూల్చేసిందని, అందుకే దీక్ష చేయాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. చేతిలో రాజ్యాంగాన్ని పట్టుకొనే తిరిగే రాహుల్ గాంధీ దీనికి బాధ్యత వహించాలని, ఖచ్చితంగా మీ ప్రభుత్వంపై గట్టి చర్యలు తీసుకోవాలని, అదే విధంగా ప్రజలను క్షమాపణ అడగాలని ఆమె కోరారు. పేద ప్రజలకు అన్యాయం చేసిన ప్రభుత్వంపై చర్యలు తీసుకోకపోతే మీరు రాజ్యాంగాన్ని పట్టుకోవటం వృథా అని, ప్రజాపాలన పేరుతో మీరు ప్రజా వేదన చేస్తున్నారన్నారు. ప్రజల ఇళ్లు కూల్చేసిన ప్రభుత్వం నిసిగ్గుగా న్యాయం చేస్తున్నామని చెబుతోందని, ఇవ్వాళ మంత్రులు 310 మందికి స్థలాలు, ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నామని ప్రకటించారని తెలిపారు.

 

The fight is just a pause for now.

 

డిసెంబర్ 9 న ముఖ్యమంత్రి వచ్చి గృహప్రవేశం చేస్తారని భట్టి చెబుతున్నారని, కానీ మీరు ఇచ్చిన టోకెన్ ల పై మాకు ఇంకా అనుమానం ఉందని పేర్కొన్నారు. అలాగే లే అవుట్ చేసి ఫిజికల్ ప్రాపర్టీని ప్రతి కుటుంబానికి చూపించాలని, మీరు కూల్చిన ఇళ్లను కొంతమంది పది లక్షలతో కొంతమంది 20 లక్షలతో కొంతమంది 30 లక్షలతో కట్టుకున్నారని, కానీ మీరు మాత్రం అందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని చెబుతున్నారన్నారు. రూ.5 లక్షలు మాత్రమే ఇస్తే వారి మిగతా నష్టం ఎవరు భరిస్తారని ప్రశ్నించారు. జస్టిస్ ఈశ్వరయ్య సమక్షంలో మళ్లీ బాధితులతో వెళ్లి మాట్లాడుతామని, వారందరికీ సంపూర్ణ న్యాయం జరిగే వరకు మా పోరాటం ఆగదని, పేదలకు న్యాయం చేసే పోరాటంలో ఎక్కడ కూడా తగ్గేదే లేదని పేర్కొన్నారు. ఖమ్మంలో భూదాన్ భూముల్లో ఉన్న కూల్చివేతలను ప్రభుత్వం ట్రయల్ గా పరీక్షించిందని, ఇక్కడ ఎలాంటి వ్యతిరేకత, అడ్డంకులు రాకపోతే రాష్ట్రంలోని భూదాన్ భూముల్లో ఇదే పని చేయాలని భావించిందని అన్నారు. రాష్ట్రంలో ఉన్న లక్షా 74 వేల ఎకరాల భూదాన్ భూములపై ప్రభుత్వ పెద్దల కన్ను పడిందని, వాటిని కాజేసే కుట్ర వెలుగుమట్ల నుంచి ప్రారంభించారని పేర్కొన్నారు. అందుకే భూదాన్ భూముల లెక్కపై శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రతిపక్షాలు మూడేళ్ల తర్వాత న్యాయం చేస్తామని బాధితులకు చెప్పాయని, కానీ అన్యాయం జరిగిన వెంటనే న్యాయం జరగాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ జేఏసీ, ధర్మసమాజ్ పార్టీ, జాగృతి కార్యకర్తలు చేసింది మామాలు ఫైట్ కాదని, వారి పోరాటం కారణంగా రాష్ట్రంలో ఇవ్వాళ రెవల్యూషన్ వచ్చిందని తెలిపారు. అలాంటప్పుడు పేద ప్రజలు, ల్యాండ్ ఓనర్ల మీదకు వెళ్లి వాళ్ల ఇళ్లను కూల్చేసిన అధికారులపై కేసులు పెట్టాలన్నారు. పేదల భూమిని కబ్జా చేసే ప్రయత్నం చేసిన అధికారులపై కచ్చితంగా కేసులు నమోదు చేయాలని, కానీ బాధితులకు అండగా నిలిచిన జాగృతి కార్యకర్తలపై కేసులు పెట్టారని బాధపడ్డారు. నాపై, విశారదన్ పై పెట్టిన కేసులు ఎత్తివేయకపోయినా పర్వాలేదని, కానీ ఎస్సీ, ఎస్టీ, బీసీ జేఏసీ, జాగృతి కార్యకర్తలపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని కోరారు. మా దీక్ష సందర్భంగా ఎన్నో ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయని, వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

More articles

Latest article