- బిచ్కుంద మండలంలో జోరుగా ఇసుక, మొరం అక్రమ దందా
- సిండికేట్ అయిన వ్యాపారులు
బిచ్కుంద, బతుకమ్మ: ఇసుక, మొరం మాఫియా రెచ్చిపోతోంది. బిచ్కుంద మండలంలో అధికార పార్టీ నేతల అండదండలతో అడ్డూఅదుపు లేకుండా ఇసుక, మొరం అక్రమ రవాణా చేస్తోంది. మండలంలోని మంజీరా నది పరీవాహక గ్రామాల్లో విచ్చలవిడిగా ఇసుకను జేసీబీలు పెట్టి తవ్వుతున్నారు. ఆయా గ్రామాల ప్రజలను, పలుకుబడి ఉన్న నేతలను, వివిధ రాజకీయ పార్టీల నాయకులను ముడుపులతో మేనేజ్ చేసి దర్జాగా అక్రమ దందాను సాగిస్తున్నారు. అధికారులకు, ప్రతినెలా వేలల్లో ముడుపులు ఇస్తూ ఎక్కడా ఎలాంటి అవాంతరాలు ఎదురవకుండా ఇసుక దందాను మూడు టిప్పర్లు.. ఆరు ట్రాక్టర్ల చందంగా నిరాటకంగా సాగిస్తున్నారు. బిచ్కుంద మండల పరిధిలోని పుల్కల్, హస్గుల్, షెట్లూర్, ఖత్ గావ్ గ్రామాల్లో మంజీరా నది పరీవాహక ప్రాంతాల్లోని ఇసుక రీచ్ ల నుంచి విచ్చల విడిగా ఇసుకను తరలిస్తున్నారు.

మండలం లోని పుల్కల్, హస్గుల్, షెట్లూర్, ఖత్ గావ్ ప్రాంతాల నుంచి ఎలాంటి అనుమతులు లేకున్నా, నిబంధనలు, నిషేధాజ్ఞలెన్నున్నా ఎవడ్రా మమ్మల్ని ఆపేదంటూ రాత్రీపగలు తేడా లేకుండా ట్రాక్టర్ల తో ఇసుకను నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాలతోపాటు కర్ణాటక, మహారాష్ట్ర కు తరలిస్తున్నారు. అడ్డగోలుగా ఇసుకను తవ్వుతున్న అక్రమార్కులు వివిధ ప్రాంతాల్లో గుట్టలుగా డంప్ చేస్తూ రాత్రి వేళల్లో ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఒక్కో ట్రాక్టర్ ఇసుక లోడ్ ను రూ. 8 వేల నుంచి రూ.10 వేల వరకు అమ్ముతున్నారని, ఇసుక మాఫియా కూడా సిండికేట్ కావడంతో గతంలో రూ. 2 వేలకు దొరికే ఇసుక ప్రస్తుతం రూ. 5 వేలకు పైగానే పెట్టి కొనాల్సి వస్తోందని జనాలు అంటున్నారు.
- కళ్లు ఉండీ చూడలేకపోతున్న అధికారులు
స్థానిక రెవెన్యూ, మైనింగ్ అధికారులకు క్రమం తప్పకుండా ముడుపులు అందుతుండడంతో కళ్లు ఉండీ చూడలేని వారిగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. దీంతో దర్జాగా ఇసుకను తరలిస్తున్న మాఫియాను అడ్డుకునే నాథుడే లేకుండా పోయారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. స్థానిక రెవెన్యూ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకుండా తమ పని చేస్తున్నామని చూపించుకోడానికి అప్పుడప్పుడు ఎక్కడో ఓ దగ్గర ఇసుక ట్రాక్టర్ ను పట్టుకుని ప్రచారం చేసుకుంటున్నారనే విమర్శలున్నాయి. ఎక్కడ వాగులు, ఒర్రెలు కనిపించినా అక్కడ ఇసుక రవాణా కోసం ట్రాక్టర్లు క్యూ కడుతున్నాయి.

- జోరుగా మొరం దందా
బిచ్కుంద మండలంలో మొరం అక్రమ దందా కూడా జోరుగా సాగుతోంది. గుట్ట ప్రాంతాల నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా యథేచ్ఛగా మొరాన్ని తరలిస్తున్నారు. బిచ్కుంద లోని గుట్టలు, చెరువుల నుంచి మొరం తరలిస్తున్నా అడ్డుకునేందుకు అధికారులు సాహసం చేయడం లేదు. సారవంతమైన మట్టిన తవ్వి వెంచర్లకు, ఇటుక బట్టీలకు తరలిస్తున్నారు. మొరం టిప్పర్లు వీఐపీ కాన్వాయ్ లా ఓవర్ లోడ్ తో ఒకదాని వెనకాల మరోటి వెళ్తున్నాయి. ఇసుక, మొరం వ్యాపారాల్లో అడ్డగోలుగా సంపాదించాలంటే అధికార పార్టీ అండ ఉండాలనే ఉద్దేశంతో రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ కండువా కప్పుకుని తమ అక్రమ దందాలను ఆపకుండా కొనసాగిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు ఇసుక, మొరం దందాలను నడుపుతున్న ముఠాలపై కఠిన చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.

