29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

బియ్యం లారీలను పట్టింది ఎవరు… వదిలేసింది ఎందుకు?

Must read

📰 Generate e-Paper Clip

 

. . . 20 టన్నుల బియ్యం పట్టుకుంటే కేసు ఎందుకు నమోదు కాలేదు ?

 

. . . పీడీఎస్ మాఫియాతో డీల్ ఎవరికీ జరిగింది ?

 

. . . రూ.1.80 లక్షలు తీసుకుని లారీలను వదిలేసింది ఎవరు ?

నిజామాబాద్, బతుకమ్మ:

నిజామాబాద్ నగర శివారులో రెండు రోజుల క్రితం రేషన్ బియ్యం లారీలను కొందరు (అధికారులా… అనధికారులా) పట్టుకున్న వ్యవహారం ఇప్పుడు జిల్లా కేంద్రంలో హాట్ టాపిక్‌గా మారింది. పట్టుకోలేదు, వాటిని ఆర్మూర్ నుంచి చేజ్ చేస్తూ వచ్చి గుండారం రోడ్డులో అడ్డుకున్నారట. పట్టుకున్నది సివిల్ సప్లై అధికారులు, పోలీసులు లేదా స్పెషల్ ఫోర్స్ సిబ్బందా అనేది తెలియదు. కానీ తెల్లారిన తర్వాత 20 టన్నుల రేషన్ బియ్యం లోడ్‌తో ఉన్న రెండు లారీలు కనిపించకుండా పోవడం చర్చనీయాంశంగా మారింది. జిల్లా పోలీస్ బాస్ సెలవులో ఉన్న సమయంలో ఈ ఘటన జరగడంతో రేషన్ బియ్యం లారీల కథను నడిపించింది ఎవరు అనే చర్చ జరుగుతోంది. బోధన్‌కు చెందిన రెండు ఐచర్ లారీలలో మూడు రోజుల క్రితం జగిత్యాల జిల్లా కేంద్రంలోని మామిడికాయల హోల్‌సేల్ వ్యాపారం జరిగే గోదాం నుంచి రేషన్ బియ్యం రవాణా అయింది. ఒక లారీలో 13 టన్నులు, మరో లారీలో 7 టన్నుల పీడీఎస్ బియ్యం జిల్లా సరిహద్దులను దాటి బోధన్‌లోని పేరుమోసిన రీసైక్లింగ్ రైస్ మిల్లుకు తరలివస్తోంది. ఈ విషయం కొందరికి సమాచారం అందింది. వారు ఏ విభాగానికి చెందినవారో తెలియదు కానీ, ఒక కారులో కమ్మర్‌పల్లి నుంచి వెంబడించారు. అయితే అప్పటికే లారీలు ఆర్మూర్ ప్రాంతాన్ని దాటి నిజామాబాద్ నగర శివారుకు చేరుకున్నాయి. దీంతో వారు ఇక్కడి వారికి సమాచారం అందించారు. సంబంధిత రెండు లారీలను గుండారం శివారులో అడ్డుకున్నారు. దీంతో బోధన్‌కు చెందిన పీడీఎస్ దందా నిర్వాహకులు, నిజామాబాద్ నగరంలోని బోధన్ రోడ్డులో రేషన్ దందా నిర్వహించే వారిని రంగంలోకి దించారు. రాత్రికి రాత్రే కేసులు, సీజ్ తదితర చర్యలు లేకుండానే లారీలు క్షేమంగా గమ్యస్థానానికి చేరినట్లు తెలిసింది. ఈ వ్యవహారంలో బోధన్‌కు చెందిన పీడీఎస్ మాఫియానే ఈ గుట్టును విప్పే అవకాశం ఉంది. నిజామాబాద్ నగర శివారులో పట్టుబడిన పీడీఎస్ బియ్యం కలిగిన లారీలను సీజ్ చేయకపోవడం, కేసులు నమోదు కాకపోవడం, బియ్యాన్ని స్వాధీనం చేసుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు రేషన్ బియ్యాన్ని పట్టింది ఎవరు? ఏ శాఖ అధికారులు? వారు వాటిపై కేసులు నమోదు చేయకుండా వదిలేయడం వెనుక ఏమి జరిగిందనే చర్చ జరుగుతోంది. బోధన్‌లోని ఓ రైస్ మిల్ పీడీఎస్ బియ్యం రీసైక్లింగ్‌కు కేరాఫ్‌గా నిలిచిందని ఆరోపణలు ఉన్నాయి. అలాంటి ప్రాంతం నుంచి పీడీఎస్ మాఫియా జిల్లా నలుమూలలకు విస్తరించింది. ఈ దందాలో బోధన్ పట్టణానికి చెందిన వ్యక్తి యాజమాన్యంలోని రెండు ఐచర్ వాహనాలు పట్టుబడగానే, నిజామాబాద్ నగరంలోని బోధన్ రోడ్డులో పీడీఎస్ దందా నిర్వహించే వ్యక్తి రంగంలోకి దిగి అక్కడ వ్యవహారాన్ని మేనేజ్ చేశాడని చర్చ జరుగుతోంది. మొత్తానికి రూ.1.80 లక్షలకు డీల్ కుదిరి, కేసులు నమోదు చేయకుండా, సీజ్ చేయకుండా, బియ్యంతో సహా వాహనాలు సురక్షితంగా గమ్యస్థానానికి చేరినట్లు ప్రచారం జరుగుతోంది. నిజామాబాద్ జిల్లాకు నల్గొండ, కరీంనగర్, జగిత్యాల, ఆదిలాబాద్ ప్రాంతాల నుంచి రేషన్ బియ్యం నిత్యం టన్నుల కొద్దీ రవాణా అవుతోంది. అలాంటి రేషన్ మాఫియాకు చెందిన పీడీఎస్ బియ్యాన్ని కొందరు పట్టుకున్నప్పటికీ ఎలాంటి కేసులు నమోదు కాకుండా, సులభంగా విడిపించుకోవడం పట్ల విస్మయం వ్యక్తమవుతోంది. పీడీఎస్ మాఫియా సంబంధాలు ఎక్కడి వరకు ఉన్నాయనే చర్చ మొదలైంది.

More articles

Latest article