. . . ఈ ఏడాదిలో రూ.1.05 కోట్ల విలువైన 658 ఫోన్లు స్వాధీనం
కామారెడ్డి, బతుకమ్మ :
మొబైల్ ఫోన్ పోగొట్టుకున్నామని లేదా చోరీకి గురైందని ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కేంద్ర ప్రభుత్వ సీఈఐఆర్ పోర్టల్ ద్వారా పోయిన మొబైల్ ఫోన్లను సులభంగా తిరిగి పొందవచ్చని కామారెడ్డి జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర తెలిపారు. ప్రస్తుత డిజిటల్ యుగంలో మొబైల్ ఫోన్ కేవలం సమాచార సాధనమే కాకుండా బ్యాంకింగ్ వివరాలు, వ్యక్తిగత ఫోటోలు, కీలకమైన డేటాను కలిగి ఉండే అత్యంత ముఖ్యమైన పరికరమని ఆయన పేర్కొన్నారు. ఫోన్ పోగొట్టుకోవడం వల్ల వ్యక్తిగత భద్రత, గోప్యతకు ముప్పు వాటిల్లే అవకాశం ఉన్నందున జిల్లా పోలీసు యంత్రాంగం మొబైల్ రికవరీపై ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. బాధితులకు త్వరితగతిన న్యాయం చేయాలనే లక్ష్యంతో ఇన్‌స్పెక్టర్ సంపత్ పర్యవేక్షణలో ఆర్ఎస్ఐ బాలరాజు మరియు ఐదుగురు కానిస్టేబుళ్లతో కూడిన ప్రత్యేక సాంకేతిక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు ఎస్పీ వెల్లడించారు. ఈ బృందం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ ప్రతి నెలా సగటున 100కు పైగా మొబైల్ ఫోన్లను రికవరీ చేస్తూ బాధితుల్లో విశ్వాసాన్ని పెంపొందిస్తోందని తెలిపారు. ఇటీవల నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా గత 30 రోజుల్లోనే రూ.25.44 లక్షల విలువైన 159 మొబైల్ ఫోన్లను రికవరీ చేసినట్లు తెలిపారు. అలాగే 2025 సంవత్సరంలో ఇప్పటివరకు రూ.1.05 కోట్ల విలువైన 658 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని బాధితులకు అప్పగించినట్లు వెల్లడించారు. గత ఏడాది సుమారు రూ.3 కోట్ల విలువైన 1,834 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి యజమానులకు అందజేసినట్లు గుర్తు చేశారు. సీఈఐఆర్ పోర్టల్ అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు కామారెడ్డి జిల్లాలో మొత్తం 4,939 మొబైల్ ఫోన్లను ట్రాక్ చేసి గుర్తించగా, సుమారు రూ.7.90 కోట్ల విలువైన ఫోన్లను బాధితులకు విజయవంతంగా అప్పగించినట్లు ఎస్పీ తెలిపారు. మొబైల్ రికవరీలో విశేష ప్రతిభ కనబరిచిన ప్రత్యేక బృందాన్ని ఈ సందర్భంగా ఆయన అభినందించారు. మొబైల్ ఫోన్ పోయిన వెంటనే ప్రజలు ఆలస్యం చేయకుండా సంబంధిత పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని, సిమ్ కార్డును బ్లాక్ చేయాలని సూచించారు. అనంతరం సీఈఐఆర్ అధికారిక పోర్టల్‌లో ఐఎంఈఐ నంబర్‌ను బ్లాక్ చేయాలని సూచించారు. పోయిన మొబైల్ ఫోన్ల ద్వారా సైబర్ మోసాలు జరిగే అవకాశం ఉన్నందున గుర్తుతెలియని లింకులు, అనుమానాస్పద కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. రికవరీ అయిన మొబైల్ ఫోన్లను తిరిగి పొందేందుకు బాధితులు సంబంధిత ధ్రువపత్రాలతో జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆర్ఎస్ఐ బాలరాజును (ఫోన్: 8712686114) సంప్రదించాలని ఎస్పీ సూచించారు.
