24.1 C
Hyderabad
Monday, August 3, 2026

మిల్లులలో తనిఖీలతో ఒరిగేది ఏమిటి?

Must read

📰 Generate e-Paper Clip

  • గుట్టుచప్పుడు కాకుండా తనిఖీలు ఎందుకు
  • ఎఫ్ సిఐ తనిఖీల ముగింపు
  • నెలాఖరు వరకు సీఎంఆర్ బకాయిలున్న మిల్లుల్లో తనిఖీలు

నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లాలో రైస్ మిల్లుల్లో జరుగుతున్న తనిఖీలపై కొత్త చర్చ జరుగుతుంది. ప్రతి యేడాది మాదిరిగానే ధాన్యంను మెక్కేసిన మిల్లర్లకు గడువు పొడగించేందుకే తనిఖీలు నిర్వహిస్తారని తర్వాత ఎలాంటి చర్యలు ఉండవని ఆరోపణలున్నాయి. నిజామాబాద్ జిల్లాలో వందల కోట్ల ధాన్యం మెక్కేసిన మిల్లర్లపై ఇప్పటి వరకు రెవెన్యూ రికవరి యాక్టు, క్రిమినల్ కేసులు నమోదు చేయలేదు కానీ తనిఖీల పేరిట కాలయాపన చేస్తున్నారని వాదన ఉంది. ప్రధానంగా గుట్టుచప్పుడు కాకుండా ప్రతిసారి జరిగే తనిఖీల్లో కొత్తగా వెలికి తీసేది ఏమి ఉందనే వాదనలు లేకపోలేదు. ఈసారి ఎఫ్ సిఐతో పాటు పౌర సరఫరాల శాఖ అధికారులు తనిఖీలు చేయడం విశేషం.
నిజామాబాద్ జిల్లాలో మూడు టీంలు తనిఖీలు చేపట్టడం విశేషం. కస్టమ్ మిల్లింగ్ రైస్ రికవరి వ్యవహరం పౌర సరఫరాల శాఖకు అపవాదును తెచ్చిపెట్టిన విషయం తెల్సిందే. ఈ విషయంలో డీఎస్ వో, డీఎం సస్పెండ్ కాగా బకాయిల కోసం టాస్క్ ఫోర్స్ సోదాలు చేపట్టింది. వేలం వేసిన ధాన్యం 2022- 23 రబీ సీజన్ లో 31 రైస్ మిల్లులలో ధాన్యం పక్కదారి పట్టిన విషయం వెలుగులోకి వచ్చింది. 10 వేల మెట్రిక్ టన్నుల దాన్యంను కొత్త ప్రభుత్వం వేలం వేయగా దక్కించుకున్న వారు ధాన్యం కోసం మిల్లులలో, గోదాములలో తనిఖీలు చేయడం, వందల కోట్ల ధాన్యం సొంతానికి వాడుకున్నట్లు తేలింది. సంబంధిత తనిఖీలు గత మూడు రోజులు జరుగగా అవి శుక్రవారం మధ్యాహ్నంతో ముగిసాయి. సంబంధిత నివేదికను ప్రభుత్వానికి అందజేయనున్నారు. సీఎంఆర్ ను పక్కదారి పట్టించిన వారిపై రెవెన్యూ రికవరి యాక్టు కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి.
వానకాలం సీజన్ కు సంబంధించి 4,75,398 మెట్రిక్ టన్నుల ధాన్యం ఇవ్వగా 24,203 మెట్రిక్ టన్నుల బియ్యం ఇప్పటికి రావాల్సి ఉంది.యాసంగికి సంబంధించి 4, 30,591 మెట్రిక్ టన్నుల ధాన్యం ఇవ్వగా లక్షా 83 వేల 472 టన్నుల సీఎంఆర్ బియ్యం రావాల్సి ఉంది. దాని ద్వారా సీఎంఆర్ రికవరి గడువును పొడగించే యోచనలో ఉన్నారు. ఈ నెల 30 వరకు గడువు ఉండగా సీఎంఆర్ కోసం మరోసారి గడువు పొడగించడం ఖాయమైంది. అదే విధంగా ప్రస్తుత సీజన్ లో ధాన్యం కేటాయింపులకు కచ్చితంగా బ్యాంక్ గ్యారెంటీని అడుగుతున్నారు.

More articles

Latest article