- రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి
నిజామాబాద్, బతుకమ్మ : అన్నదాతకు ఆలంబనగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు నేస్తం కార్యక్రమాన్ని ప్రతి రైతు సద్వినియోగం చేసుకోవాలని నిజామాబాద్ రూరల్ శాసన సభ్యులు డాక్టర్ ఆర్.భూపతిరెడ్డి సూచించారు. రైతు వేదికలకు వీడియో కాన్ఫరెన్స్ వ్యవస్థను అనుసంధానం చేస్తూ నూతనంగా ఆడియో, విజువల్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చిన వాటిని రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి సోమవారం రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లోని ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వ విద్యాలయం నుండి వర్చువల్ విధానం ద్వారా ప్రారంభోత్సవం చేశారు. అదేవిధంగా రైతు భరోసా కింద రైతుల ఖాతాలలో మలి విడత నగదు బదిలీకి సీ.ఎం లాంఛనంగా శ్రీకారం చుట్టారు. తొమ్మిది రోజులలో రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ. 9 వేల కోట్లు జమ చేస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు. నిజామాబాద్ జిల్లా జక్రాన్ పల్లి మండలం అర్గుల్ రైతు వేదిక నుండి రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్.భూపతి రెడ్డి, కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి, ఇతర వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు తదితరుల సందేశాలను, ఆదర్శ రైతుల అనుభవాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా స్థానిక రైతులతో కలిసి వీక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూపతిరెడ్డి స్థానిక రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ, ఆధునిక సాంకేతికతను సాగు రంగానికి అనుసంధానం చేస్తూ, రైతుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం రైతు నేస్తం కార్యక్రమాన్ని చేపట్టిందని, సాగు రంగంలో ఇది సరికొత్త విప్లవానికి ఇది నాందిగా నిలుస్తుందని అన్నారు. తొలివిడతగా 110 రైతు వేదికలకు వీడియో కాన్ఫరెన్స్ వ్యవస్థను సమకూర్చడం జరిగిందని, ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా గల 2600 రైతు వేదికలకు దీనిని విస్తరించారని తెలిపారు. జిల్లాలో తొలి విడతలో 31 రైతు వేదికలో వీడియో కాన్ఫరెన్స్ వసతి ఉండగా, ప్రస్తుతం కొత్తగా మరో 49 రైతు వేదికలలో ఈ విధానం అందుబాటులోకి వచ్చిందని వివరించారు. వీటి ద్వారా రైతులు ప్రతి మంగళవారం నిష్ణాతులైన వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులను సంప్రదించి తమ సమస్యలను వారి దృష్టికి తెచ్చి పరిష్కరించుకునే వెసులుబాటు ఏర్పడిందని అన్నారు. ప్రధానంగా పంటల సాగుకు అయ్యే పెట్టుబడిని తగ్గించుకోవడం, నూతన వంగడాల తయారీ, అధిక దిగుబడులను సాధించేందుకు పాటించాల్సిన పద్ధతులపై సలహాలు, సూచనలు, మెళకువలు తెలుసుకునేందుకు రైతు నేస్తం ఎంతగానో దోహదపడుతుందని సూచించారు. నేటి పరిస్థితుల్లో రైతులు సేంద్రీయ వ్యవసాయం, పంట మార్పిడిపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు.
రైతాంగాన్ని ఆదుకోవాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం రూ. 21వేల కోట్ల రుణ మాఫీ చేసిందని గుర్తు చేశారు. ఇందులో భాగంగా నిజామాబాద్ జిల్లా రైతాంగానికి రూ. 755.29 కోట్ల మేర లబ్ది చేకూరగా, అందులో అత్యధికంగా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం రైతులకు రూ. 205 కోట్ల లబ్ది చేకూరిందని హర్షం వెలిబుచ్చారు. రుణమాఫీ ద్వారా జిల్లాలో 25 లక్షల మంది రైతులు ప్రయోజనం పొందారని అన్నారు. సన్నాలకు బోనస్ చెల్లింపుల్లోనూ నిజామాబాద్ జిల్లా రైతాంగానికి రాష్ట్రంలోనే అత్యధికంగా రూ. 1158.63 కోట్ల చెల్లింపులు జరిగాయని అన్నారు. ఇటీవలే సేకరించిన రబీ ధాన్యానికి సంబంధించి కూడా త్వరలోనే ప్రభుత్వం రైతుల ఖాతాలలో బోనస్ జమ చేస్తుందని భరోసా కల్పించారు. ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటును సద్వినియోగం చేసుకుని ప్రతి రైతు ఆర్థికాభివృద్ధి సాధించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. తక్కువ విస్తీర్ణంలో, తక్కువ పెట్టుబడితో ఆధునిక సాగు విధానాలను అవలంబిస్తూ అధిక దిగుబడులు సాధించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ ఆర్డీఓ రాజాగౌడ్, జిల్లా వ్యవసాయ అధికారి వీరాస్వామి, ఐడీసీఎంఎస్ మాజీ చైర్మన్ మునిపల్లి సాయిరెడ్డి, శేఖర్ గౌడ్, సొసైటీల చైర్మన్ లు, వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులు, ఆదర్శ రైతులు పాల్గొన్నారు.

