. . . జాతీయ రహదారిపై వి.ఐ.డి.ఎస్ ప్రారంభించిన డీజీపీ బి.శివధర్ రెడ్డి
ఇందల్ వాయి, బతుకమ్మ :
ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు, సూచనలు పాటిస్తూ ప్రయాణం చేయాలని, మనపై ఆధారపడ్డ వారికి కన్నీరు మిగిల్చరాదని తెలంగాణ రాష్ట్ర డిజిపి బి. శివధర్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఇందల్ వాయి పోలీస్ స్టేషన్ పరిధిలో గల 44వ జాతీయ రహదారి గల చంద్రాయన్ పల్లి గ్రామం వద్ద 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మంగళవారం నిర్వహించిన వి.ఐ.డి.ఎస్ (వీడియో సంఘటన గుర్తింపు వ్యవస్థ) ప్రారంభ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా డిజిపి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ హెల్మెట్లు తప్పనిసరిగా ధరించాలని, జాతీయ రహదారిపై డిఫెన్స్ డ్రైవింగ్ తప్పకుండా పాటించాలని అన్నారు. వాహనానికి వాహనానికి డిస్టెన్స్ మెయింటేన్ చేయాలని, వాహనం వేగంగా వెళ్లకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ఈ నిబంధనలపై ఇతరులకు కూడా అవగాహన కల్పించే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని తెలియజేశారు. తదుపరి గ్రామ ప్రజలతో అరైవ్ అలైవ్ కార్యక్రమానికి సంబంధించినటువంటి ప్రతిజ్ఞ చేయించారు.

అనంతరం వి.ఐ.డి.ఎస్ (వీడియో సంఘటన గుర్తింపు వ్యవస్థకు) సంబంధించినటువంటి ట్రాఫిక్ నియంత్రణ వ్యవస్థను ప్రారంభించారు. ఇది మానవ ప్రమేయం లేకుండా ట్రాఫిక్‌ను నిరంతరం పర్యవేక్షించడానికి, ఏఐ విశ్లేషణలతో కూడిన హై-డెఫినిషన్ నిఘా కెమెరాలను ఉపయోగిస్తుందన్నారు.

ఈ కార్యక్రమంలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, అదనపు డీసీపీ (అడ్మిన్) జి.బస్వారెడ్డి, నిజామాబాద్ ఇన్ చార్జి ఏసిపి రాజా వెంకటరెడ్డి, ఆర్మూర్ ఏసిపి వెంకటరెడ్డి, డిచ్ పల్లి సిఐ కె వినోద్, ట్రాఫిక్ ఇన్స్ పెక్టర్ ప్రసాద్, ట్రాఫిక్ రిజర్వ్ ఇన్స్ పెక్టర్ వినోద్, డిచ్ పల్లి ఎస్ఐ ఆరీఫ్, ఇందల్ వాయి ఎస్ఐ జి.సందీప్, ఈ -డార్ మేనేజర్ వర్ష, ప్రాజెక్ట్ మేనేజర్ వంశీధర్, టోల్ ప్లాజా మేనేజర్ వీరబాలు, గ్రామ సర్పంచ్ రఘు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.


