చర్లపల్లి రైల్వే టెర్మినల్ కు పొట్టి శ్రీరాములు పేరు ప్రతిపాదన
సీఎం రేవంత్ రెడ్డి
వెబ్ న్యూస్, బతుకమ్మ : తెలంగాణ కోసం కృషి చేసిన వాళ్లను స్మరించుకుంటున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. శాసన సభలో ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్, తెలుగు వర్సిటీ పేరు మార్పు తదతర బిల్లులు ప్రవేశపెట్టిన నేపథ్యంలో సీఎం మాట్లాడారు. తెలుగు రాష్ట్రాల్లో ఒకే పేరుపై యూనివర్సిటీలు, సంస్థలు ఉంటే పరిపాలనా పరమైన సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశముందన్నారు. దాన్ని పరిష్కరించేందుకు రాష్ట్రంలోని యూనివర్సిటీలు, సంస్థలకు తెలంగాణకు సంబంధించిన వారి పేర్లు పెడుతున్నామన్నారు. చర్లపల్లి రైల్వే టెర్మినల్ కు పొట్టి శ్రీరాములు పేరు పెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతిపాదిస్తున్నట్లు చెప్పారు. ఈవిషయమై కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డిలకు లేఖ రాస్తానని తెలిపారు. తెలుగు యూనివర్సిటీకి సురవరం పేరు పెట్టాలని గత శాసనసభలోనే నిర్ణయించామన్నారు. రాజకీయాలు కలుషితం అయ్యాయో, ఆలోచనలు కలుషితం అయ్యాయో తెలియదని, కొందరు వీటిపై అపోహలు కల్పించేలా మాట్లాడుతున్నారన్నారు. ఇది ఓ వ్యక్తి కోసమో, కులం కోసమో తీసుకున్న నిర్ణయం కాదని సీఎం స్పష్టం చేశారు.
నేచర్ క్యూర్ ఆస్పత్రికి రోశయ్య పేరు
బల్కంపేటలో నేచర్ క్యూర్ ఆస్పత్రికి రోశయ్య పేరు పెడతామని సీఎం అన్నారు. ఆస్పత్రి సమీపంలో రోశయ్య విగ్రహం నెలకొల్పి అధికారికంగా జయంతి, వర్ధంతి కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.
