. . . బోధన్ టూ జగిత్యాల 180 గ్రామాల మీదుగా సాగనున్న సైకిల్ యాత్రః
. . . బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :
ఈ నెల 27 నుంచి రైతుల హామీల అమలుకై కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో సైకిల్ యాత్ర చేపడుతున్నట్లు బీజేపీ జిల్లా అధ్యక్షులు,దినేష్ పటేల్ కులాచారి తెలిపారు. సోమవారం బిజెపి జిల్లా పార్టీ కార్యాలయంలో బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు తిరుపతి రెడ్డి అధ్యక్షతన సైకిల్ యాత్ర సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని, ఆ హామీలను తక్షణమే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ పార్లమెంటు సభ్యులు ధర్మపురి అరవింద్ ఆదేశాల మేరకు బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఈ నెల 27వ తేదీ నుంచి బోధన్ నుండి ప్రారంభమై, అక్టోబర్ 4వ తేదీన జగిత్యాల వరకు దాదాపు 180 గ్రామాల మీదుగా కిసాన్ మోర్చా సైకిల్ యాత్ర కొనసాగుతుందని తెలిపారు. షరతులు లేకుండా రూ. 2 లక్షల వరకు రైతు రుణమాఫీని పూర్తిస్థాయిలో అమలు చేయాలని, కౌలు రైతులకు కూడా రైతు భరోసా వర్తింపజేయాలని, అన్ని రకాల వడ్లకు బోనస్ అందించడంతో పాటు, మేనిఫెస్టోలో పేర్కొన్న 10 రకాల పంటలకు బోనస్ చెల్లించాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ రైతు కూలీలకు సంవత్సరానికి రూ. 12,000 ఆర్థిక సాయం అందించాలని, పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను రాష్ట్రంలో అమలు చేయాలని, నిజామాబాద్ నగరంలో జాతీయ పసుపు బోర్డు కార్యాలయ నిర్మాణానికి ప్రభుత్వం వెంటనే స్థలం కేటాయించాలని డిమాండ్ చేశారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ (బోధన్), ముత్యంపేట్ చక్కెర కర్మాగారాలను తెరిపించాలని, రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు (ఎఫ్ పీవో) తగిన ప్రభుత్వ ప్రోత్సాహకాలు అందించాలన్నారు.రైతుల హక్కుల సాధన కోసం చేపడుతున్న ఈ సైకిల్ యాత్రలో అన్నదాతలు, పార్టీ శ్రేణులు, ప్రజాసంఘాలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి మాట్లాడుతూ దశాబ్దాల ఇందూర్ రైతాంగ కల అయిన జాతీయ పసుపు బోర్డును ప్రధాని నరేంద్ర మోదీ మంజూరు చేస్తే, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కార్యాలయ నిర్మాణానికి స్థలం ఇవ్వకుండా జాప్యం చేస్తుందన్నారు.కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎరువులపై లక్షల కోట్ల రూపాయల సబ్సిడీ భరిస్తూ, పీఎం-కిసాన్ ద్వారా ప్రతి ఏటా ఆర్థిక సాయం అందిస్తూ రైతులకు అండగా నిలుస్తోంది. కానీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కౌలు రైతులకు, వ్యవసాయ కూలీలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి రైతులను మోసం చేస్తుందన్నారు. రైతుల హక్కుల సాధనకై బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో చేపడుతున్న ఈ సైకిల్ యాత్రలో రైతులు, సంఖ్యలో కదలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో కిసాన్ మోర్చ నాయకులు వెల్మ గంగారెడ్డి, అంతిరెడ్డి హరీష్ రెడ్డి, తోట చిన్నయ్య, జిల్లా పదాధాకారులు, కిసాన్ మోర్చ మండల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

