హైదరాబాద్, బతుకమ్మ: పసుపు బోర్డు ఏర్పడక ముందు పసుపు ధర రూ.16వేల వరకు పలకగా, ఈ సంవత్సరం బోర్డు ఏర్పడిన తరువాత రూ.8వేల నుంచి రూ.9వేల ధర పలుకుతోందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పసుపు రైతుల సమస్యలపై అసెంబ్లీ జీరో అవర్ లో ఆయన మాట్లాడారు.
నిజమాబాద్ జిల్లాలోని ఆర్మూర్, బాల్కొండ, నిజమాబాద్ రూరల్, జగిత్యాల జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల, నిర్మల్ జిల్లాలోని నిర్మల్, ముథోల్, ఖానాపూర్ నియోజకవర్గాల రైతులు పసును నిజామాబాద్ గంజ్ కు తీసుకుచ్చి విక్రయిస్తున్నారన్నారు. ఈ సీజన్ ప్రారంభంలో రూ.12వేల ధర పలకగా, ప్రస్తుతం రూ.8వేలకు పడిపోయిందని, అదే మహారాష్ర్టలోని సాంగ్లీ మార్కెట్ లో రూ.13వేల నుంచి రూ.14వేల ధర లభిస్తోందన్నారు. పసుపు బోర్డు ఏర్పాటుతో మద్దతు ధర లభిస్తుందని ఆశించిన రైతులకునిరాశే మిగిలిందన్నారు. వ్యాపారులు సిండికేట్ గా మారి రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు.
సిండికేట్ గా మారిన వ్యాపారులపై చర్యలు తీసుకుని సాంగ్లీ మార్కెట్ లో లభిస్తున్న ధర నిజామాబాద్ లో దక్కేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. కాంగ్రెస్ రైతు డిక్లరేషన్మ్యానిఫెస్టోలో క్వింటాల్ పసుపును రూ.12వేలకు కొంటామని హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. ఒకవేళ పసుపు రూ.9వేల కు విక్రయించాల్సి వస్తే మిగతా రూ.3వేలు ప్రభుత్వమే రైతులకు చెల్లించాలని డిమాండ్ చేశారు.
