27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వ పరంగా కొనుగోలు చేస్తున్నాం

Must read

📰 Generate e-Paper Clip

 

. . . రైతులు ఆందోళనకు గురి కావద్దు

 

. . . జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

అకాల వర్షం వల్ల తడిసిన ధాన్యాన్ని మద్దతు ధర చెల్లిస్తూ ప్రభుత్వంపరంగా కొనుగోలు చేస్తామని, రైతులు ఎలాంటి ఆందోళనకు గురి కావద్దని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి భరోసా కల్పించారు. కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుండి సేకరిస్తున్న తడిసిన ధాన్యాన్ని బాయిల్డ్ రైస్ మిల్లులకు తరలించే ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించామని అన్నారు. రాష్ట్ర సచివాలయం నుండి బుధవారం రాత్రి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు తదితరులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్ష నిర్వహించారు. ఆకాల వర్షాల నేపథ్యంలో ఆయా జిల్లాల్లో ధాన్యం సేకరణను వేగవంతం చేసేందుకు చేపట్టాల్సిన చర్యలపై కలెక్టర్లకు స్పష్టమైన దిశా నిర్దేశం చేశారు. అధికారులు క్షేత్రస్థాయిలో ఉంటూ, ఎట్టి పరిస్థితుల్లోనూ రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. వీ.సీ అనంతరం కలెక్టర్ ఇలా త్రిపాఠి జిల్లా అధికారులతో సమావేశమై కీలక సూచనలు చేశారు. జిల్లాలో ఇప్పటికే ధాన్యం సేకరణ ప్రక్రియ ముగింపు దశకు చేరిందని అన్నారు. అయితే దిగుబడులు ఆలస్యంగా వచ్చిన చోట ధాన్యం సేకరణ కోసం ఇంకనూ సుమారు 120 వరకు కొనుగోలు కేంద్రాలను అందుబాటులో ఉంచామని తెలిపారు. అకాల వర్షం కురిసిన కారణంగా జిల్లాలో బషీరాబాద్, ఉప్లూర్ తదితర ప్రాంతాల్లో సుమారు 40 మెట్రిక్ టన్నుల వరకు ధాన్యం బస్తాలు తడిసినట్లు తమ దృష్టికి వచ్చిందని అన్నారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా అధికారులను క్షేత్రస్థాయిలో పరిశీలన కోసం పంపడం జరిగిందని, తడిసిన ధాన్యాన్ని వేగవంతంగా బాయిల్డ్ రైస్ మిల్లులకు తరలించేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. తాను కూడా స్వయంగా మిల్లులను సందర్శించి, ధాన్యం తరలింపు, అన్ లోడింగ్ ప్రక్రియలను పరిశీలించాలని కలెక్టర్ వెల్లడించారు. తడిసిన ధాన్యం విషయమై ఎలాంటి ఆందోళనకు గురి కావద్దని, ప్రభుత్వం కల్పించిన వెసులుబాటు మేరకు తడిసిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేయడం జరుగుతోందని ఈ సందర్భంగా కలెక్టర్ రైతులకు భరోసా కల్పించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ముందుగా తడిసిన ధాన్యాన్ని బాయిల్డ్ రైస్ మిల్లులకు తరలించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు డీసీపీ శుభం నగ్రాలే, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

 

We are purchasing soaked grain on a government basis.

More articles

Latest article