డిచ్‌పల్లి, బతుకమ్మ :
తెలంగాణ విశ్వవిద్యాలయం జాతీయ సేవా పథకం (ఎన్‌ఎస్‌ఎస్) సెల్ ఆధ్వర్యంలో పర్యావరణ విద్యా కార్యక్రమం (ఈఈపీ) కింద జాతీయ గ్రీన్ కార్ప్స్ (ఎన్‌జీసీ) దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ సెమినార్ హాల్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందించింది. ఈ సందర్భంగా ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్ – 2 కార్యక్రమాధికారి డా.ఎ.ఎ.హలీం ఖాన్ మాట్లాడుతూ జాతీయ గ్రీన్ కార్ప్స్ దినోత్సవం ప్రాముఖ్యతను వివరించారు. అనంతరం ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు పర్యావరణ పరిరక్షణపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్ – 1 కార్యక్రమాధికారి డా.శ్రీనివాస్ మాట్లాడుతూ యువత పర్యావరణ పరిరక్షణలో కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నోడల్ అధికారి డా. రమేశ్వర్ మాట్లాడుతూ ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే నష్టాలను వివరించారు. ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా పర్యావరణహిత ఉత్పత్తులను వినియోగించాలని విద్యార్థులకు సూచించారు.

ఎన్‌ఎస్‌ఎస్ సెల్ కార్యక్రమ సమన్వయకర్త ప్రొ.కె. అపర్ణ మాట్లాడుతూ విద్యార్థుల్లో పర్యావరణ బాధ్యతను పెంపొందించే కార్యక్రమాలను మరింత విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ నేషనల్ గ్రీన్ కార్ప్స్ ప్రాజెక్టు అధికారి బోస్కె విద్యాసాగర్ మాట్లాడుతూ వివిధ రకాల మొక్కల పెంపకం ద్వారా జీవవైవిధ్యాన్ని కాపాడవచ్చని తెలిపారు. మొక్కల సంరక్షణతో కీటకాలు, పక్షులు, ఇతర జీవరాశులకు రక్షణ లభిస్తుందని పేర్కొన్నారు. ఎకో క్లబ్‌ల ద్వారా పర్యావరణ పరిరక్షణ, జీవవైవిధ్య సంరక్షణ, ప్రజల్లో అవగాహన పెంపొందించడమే జాతీయ గ్రీన్ కార్ప్స్ లక్ష్యమని ఆయన వివరించారు. ఎల్‌నినో, క్లౌడ్‌బర్స్ట్‌లు, వాతావరణ మార్పులు, గ్లోబల్ వార్మింగ్ వంటి సవాళ్లను ఎదుర్కోవాలంటే ప్రతి ఒక్కరూ ప్రకృతి పరిరక్షణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు అధ్యాపకులు, ఎన్‌ఎస్‌ఎస్ అధికారులు, వాలంటీర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.

