. . . 104 మంది బాలబాలికల సంరక్షణ
. . . బాల కార్మికులను పనిలో పెట్టుకున్న వారిపై 27 కేసులు నమోదు
రాజన్న సిరిసిల్ల, బతుకమ్మ :
రాజన్న సిరిసిల్ల జిల్లాలో అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో నిర్వహించిన ఆపరేషన్ ముస్కాన్ విజయవంతంగా పూర్తయిందని జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే తెలిపారు. జూలై 1 నుంచి 31 వరకు నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో జిల్లా వ్యాప్తంగా 104 మంది బాలబాలికలను గుర్తించి, వారిని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (సీడబ్ల్యూసీ) ముందు హాజరుపరిచి, తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించిన అనంతరం అప్పగించినట్లు వెల్లడించారు. అలాగే 18 సంవత్సరాల లోపు పిల్లలను పనిలో పెట్టుకుని పనిచేయించిన వారిపై 27 కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనతో పాటు తప్పిపోయిన చిన్నారులను గుర్తించి వారి కుటుంబాలకు చేర్చే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాలను నిర్వహిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ శాఖతో పాటు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, కార్మిక శాఖ, విద్యాశాఖ, జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్, రెవెన్యూ, వైద్య ఆరోగ్య శాఖలు, ఇతర ప్రభుత్వ విభాగాలు, స్వచ్ఛంద సంస్థలు సమన్వయంతో విస్తృత తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు. బాలల హక్కులను పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్న ఎస్పీ, బాల కార్మికులను పనిలో పెట్టుకున్న వారిపై చట్టపరమైన చర్యలు కొనసాగుతాయని హెచ్చరించారు. వీధి బాలలు లేదా బాల కార్మికులు కనిపించిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆపరేషన్ ముస్కాన్ విజయవంతం కావడానికి సహకరించిన అన్ని శాఖల అధికారులు, సిబ్బంది, స్వచ్ఛంద సంస్థలను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.
