. . . పశువుల అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా
భిక్కనూర్, బతుకమ్మ :
బక్రీద్ పండుగను పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా శాంతి భద్రతలను కట్టుదిట్టం చేయడంలో భాగంగా భిక్కనూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ని టోల్ ప్లాజా వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక చెక్ పోస్ట్ ను కామారెడ్డి జిల్లా ఎస్పీ యం.రాజేష్ చంద్ర బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా చెక్ పోస్ట్ వద్ద చేపడుతున్న వాహనాల తనిఖీ విధానం, రికార్డుల నిర్వహణ, విధుల్లో ఉన్న పోలీసు సిబ్బంది పని తీరును ఆయన పరిశీలించారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, సంబందిత అనుమతి పత్రాలను తప్పని సరిగా పరిశీలించాలని సూచించారు. తనిఖీ చేసిన వాహనాల వివరాలను ఎప్పటికప్పడు స్పష్టంగా నమోదు చేస్తూ పారదర్శకత పాటించాలన్నారు. విధులు నిర్వహించే సిబ్బంది అప్పమత్తంగా ఉండాలని, నిర్లక్ష్యం వహిస్తే శాఖా పరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. పండగ ముందస్తు చర్యల్లో భాగంగా పోలీస్, రెవెన్యూ, పశు సంవర్థక శాఖల అధికారులు పూర్తి సమన్వయంతో పని చేస్తూ పశువుల రవాణాపై నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని సూచించారు. ఈ తనికీ కార్యక్రమంలో కామారెడ్డి డీఎస్పీ మదుసూదన్, భిక్కనూర్ సీఐ నరేష్, ఎస్సై ప్రభాకర్, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

