. . . సీఎం రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు
హైదరాబాద్, బతుకమ్మ :
మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టులో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు కీలక ముందడుగు పడింది. హైదరాబాద్‌లోని బాపూ ఘాట్ వద్ద ఈ ప్రాజెక్టు పనులు చేపట్టేందుకు కేంద్ర రక్షణ శాఖ అనుమతులు మంజూరు చేసింది. ఈ నిర్ణయం పట్ల ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు, భారత సైన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ అభివృద్ధి దృక్పథంలో గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు అనుమతి లభించడం ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుందని సీఎం పేర్కొన్నారు. మూసీ నది సమగ్ర పునరుజ్జీవనం, నదీ తీర ప్రాంతాల అభివృద్ధి, ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదల లక్ష్యంగా ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు ఈ అనుమతి మరింత బలాన్నిస్తుందని ఆయన తెలిపారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టు ద్వారా మూసీ నది పరివాహక ప్రాంతం పర్యావరణపరంగా పునరుద్ధరించబడటంతో పాటు ప్రజలకు ఆహ్లాదకరమైన ప్రజా ప్రదేశాలు, సాంస్కృతిక కేంద్రాలు, పర్యాటక ఆకర్షణలు అందుబాటులోకి వస్తాయని ముఖ్యమంత్రి వెల్లడించారు. తెలంగాణ అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ, భారత సైన్యం అందిస్తున్న సహకారానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ ప్రాజెక్టు నగర అభివృద్ధికి, పర్యావరణ పరిరక్షణకు, సాంస్కృతిక వారసత్వ పరిరక్షణకు దోహదపడుతుందని పేర్కొన్నారు.

