నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నగరంలోని వన్ టౌన్ పరిధిలో ద్వి చక్రవాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరిని సోమవారం అరెస్ట్ చేసినట్లు ఎస్ఎచ్ఓ రఘుపతి తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. నగరంలోని కంఠేశ్వర్ మారుతీ నగర్ కు చెందిన దంతాల శంకర్ ప్రసాద్ ఈనెల 7న తన ద్విచక్ర వాహనాన్ని ఖలీల్ వాడీలోని డి.శ్రీనివాస్ స్కిన్ ఆసుపత్రి ముందు పార్క్ చేశారు. లోనికి వెళ్లి తిరిగి వచ్చే సరికి గుర్తుతెలియని వ్యక్తులు తన వాహనాన్ని దొంగిలించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో భాగంగా సోమవారం నగరంలోని బోదన్ బస్టాండ్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా అటుగా వెళుతున్న రెండు వాహనాలను ఆపి ఆ బైకులకు సంబంధించిన కాగితాలను చూపించమనగా వారు బైకులకు సంబంధించిన పత్రాలు చూపించలేక తప్పించుకోవడానికి ప్రయత్నించగా వారిని పట్టుకొని విచారించారు. కోటగిరి మండలంలోని రచ్చపల్లికి చెందిన తాటిపల్లి గొల్ల గోపాల్, నగరంలోని వెంగల్ రావు కాలనీకి చెందిన అర్బాజ్ ను అదుపులోకి తీసుకుని వచారించారు. దీంతో తాము బైక్ దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నారు. వారి వద్ద నుంచ మూడు ద్వి చక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నారు. దీంతో వారిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు.
