మహబూబ్ నగర్, బతుకమ్మ : ఎదురెదురుగా రెండు ఆటోలు ఢీకొన్న ఘటనలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. ఈ ఘటన మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలం కొత్తమొల్గర సమీపంలో గురువారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. వనపర్తి జిల్లా ఖిల్లా ఘనపురం మండలానికి చెందిన ముగ్గురు ప్రయాణికులు ఆటోలో భూత్పూర్ వైపు వెళ్తున్నారు. ఆటో డ్రైవర్ అజాగ్రత్తగా నడుపుతూ కొత్తమొల్గర సమీపంలో ఎదురుగా వస్తున్న మరో ఆటోను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో గట్టుకాడిపల్లి గ్రామానికి చెందిన సం పల్లి వంశీ (24), హైదరాబాద్ కు చెందిన నర్సింహా రెడ్డి (57), ఘటనా స్థలంలోనే మృతి చెందారు. దొంతికుంట తండాకు చెందిన పాత్లవత్ సక్రి (34), తీవ్రంగా గాయపడటంతో జిల్లా ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందింది. కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
