. . . కాంగ్రెస్ పార్టీలో విధేయతకు దక్కిన గౌరవం
. . . కన్నడ నాట సీఎం పదవి చేపట్టనున్న డికే.శివ కుమార్
వెబ్ డెస్క్, బతుకమ్మ:
కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి సిద్దిరామయ్య రాజీనామా చేయడంతో కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టడం అనేది దాదాపు ఖాయం అయింది. డీకే శివకుమార్ కి ముఖ్యమంత్రి పదవి అనేది కాంగ్రెస్ పార్టీకి ఆపద వచ్చిన ప్రతిసారీ అడ్డుగోడగా నిలబడిన ఒక ‘ట్రబుల్ షూటర్’కు దక్కిన అత్యున్నత గౌరవమని చెబుతున్నాయి కాంగ్రెస్ శ్రేణులు. సిద్ధరామయ్య తన పదవి నుంచి తప్పుకున్న తరుణంలో, అధిష్టానం డీకేకే పూర్తి బాధ్యతలు అప్పగించడం వెనుక దశాబ్దాల నిబద్ధత ఉంది. 2002 మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం. విలాస్‌రావు దేశ్‌ముఖ్ ప్రభుత్వం కూలిపోతుందని ప్రత్యర్థులు సంబరాలు చేసుకుంటున్న వేళ, డీకే శివకుమార్ రంగంలోకి దిగారు. ఎవరికీ తెలియని విషయం ఏమిటంటే, ఆ ఎమ్మెల్యేలను బెంగుళూరుకు తరలించేటప్పుడు డీకే స్వయంగా ఫ్లైట్ టిక్కెట్లు బుక్ చేయకుండా, రోడ్డు మార్గంలో రహస్య మార్గాలను ఎంచుకున్నారు. ఆ 40 మంది ఎమ్మెల్యేలను తన సొంత రిసార్టులో ఉంచి వారిని బయటి వ్యక్తులతో కలవనియకుండా వ్యూహాలను అమలు చేస్తూ మహరాష్ట్ర లో కాంగ్రెస్ ప్రభుత్వం నిలబడటానికి సహకరించారు. ఇక 2017 రాజ్యసభ ఎన్నికల ఘట్టం ఒక అగ్ని పరీక్ష. అహ్మద్ పటేల్‌ను ఓడించి, కాంగ్రెస్ కీలక నాయకుడిని ఓడించి దెబ్బతీయాలని అమిత్ షా అప్పట్లో పక్కా ప్రణాళికలు వేశారు. అధిష్టానం సూచనలతో రంగంలోకి దిగిన డీకే గుజరాత్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరినీ బిజెపికి చిక్కకుండా కాశ్మీర్, ముంబై అంటూ తిప్పుతూ చివరికి బెంగళూరు తన రిసార్ట్ కి చేర్చారు. ఆ సమయంలో ఐటీ దాడులు జరుగుతున్నా, డీకే తన ఫోన్లను స్విచ్ ఆఫ్ చేసి, తన అనుచరుల ద్వారా ఎమ్మెల్యేల ప్రతి కదలికను మానిటర్ చేశారు. అమిత్ షా వంటి నాయకుడు రంగంలో ఉన్నప్పుడు, ఒకే రిసార్టులో 42 మంది ఎమ్మెల్యేలను కదలకుండా ఉంచడం మామూలు విషయం కాదు.

డీకే తన ఇంటికి ఐటీ అధికారులు వస్తున్నారని తెలిసి కూడా, తాను రిసార్టులో ఎమ్మెల్యేల దగ్గరే ఉండిపోయి, అక్కడి నుంచే మొత్తం ఆపరేషన్ నడిపించారు. అహ్మద్ పటేల్ గెలిచిన రోజు, డీకేకి ఫోన్ చేసి సోనియా గాంధీ పలకరించినప్పుడు, “మీరు లేకపోతే ఇది సాధ్యమయ్యేది కాదు” అని చెప్పిన మాట ఆయనకు వంద పదవులతో సమానం అయింది. బీజేపీ ఆయనపై వేసిన కేసులు, ఈడీ విచారణలు అన్నీ కేవలం ఆయనను పార్టీకి దూరం చేయడానికే. ఆయనకు ఎంతటి ఆఫర్లు ఇచ్చారంటే, కాంగ్రెస్ నుంచి తప్పుకుంటే బీజేపీ లోకి వస్తే నీ కేసులన్నీ ఎత్తేస్తాం’ అని కూడా చెప్పారు. కానీ డీకే లొంగలేదు నాకు అధికారం ముఖ్యం కాదు, కాంగ్రెస్ పార్టీ ముఖ్యం” అని జైలును ఎంచుకున్నాడు తప్ప వెనక్కి తగ్గలేదు అలాంటి కచ్చితమైన నిబద్దతే ఆయనను తీహార్ జైలులో సోనియా గాంధీ వచ్చి పలకరించేలా చేసింది పార్టీ మొత్తం ఆయన వెనుక నిలబడేలా చేసింది. 2023లో అధికారం దక్కినప్పుడు, సిద్ధరామయ్య కి సీఎం పదవి దక్కినా, డీకే ఏమాత్రం అసహనానికి లోను కాలేదు. పార్టీ గెలుపు కోసం తనకున్న నెట్‌వర్క్ అంతా వాడి, కింది స్థాయి కార్యకర్త వరకు పార్టీని ఎలా బలోపేతం చేయాలో చేసి చూపించారు. సిద్ధరామయ్య రాజీనామా చేసి ఆఫీసు నుంచి బయటకు వస్తుంటే, డీకే ఆయనను సాదరంగా పలకరించి, ఆయనకు పాదాభివందనం చేశారు ఇది ఆయన నిబద్దత. సోనియా గాంధీ మీద నమ్మకంతో, కాంగ్రెస్ జెండానే ఊపిరిగా బతికిన ఒక అంకితభావం గల నాయకుడికి దక్కిన విజయం అని చెప్పాలి.
