గురుకులాల్లో దొంగ బుద్ధులు 

0 6,713
  • పిల్లలకు కోత – సిబ్బంది మోత
  •  చికెన్, మటన్ టిఫిన్ బాక్షుల్లో 
  • సంచుల్లో  కాయగూరలు, దినుసులు 
  • అందులోనే చాయిలు, భోజనాలు

నిజామాబాద్, బతుకమ్మ: అందరు అడవిలో దోచుకుంటుంటే సిబ్బంది మాత్రం గురుకులాల్లో దోచుకుంటున్నారు. దీనివల్ల పిల్లలకు అందవలసిన పౌష్టికాహారం అందడం లేదు. ఇలాంటి  నాణ్యత లేని ఆహారం భుజించడం వల్ల   ఆరోగ్యం క్షీణించి ఆసుపత్రుల పాలవుతున్నారు.  ఉదయం నుంచి సాయంత్రం వరకు పూట, పూటకు తేనీరుతో పాటు, పిల్లల కోసం ప్రత్యేకంగా చేసిన తినుబండరాలను ముందుగానే  సిబ్బంది  లాగించేస్తున్నారు. అల్ఫాహారం, మద్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్ ను  గురుకులాల్లోనే  కానిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో వారికి ఇష్టమైన ఆహార పదార్థాలను తయారు చేయించుకొని తింటున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

టిఫిన్ బాక్సుల్లోకి మాంసం..

విద్యార్థులకు మాంసకృత్తులు అందాలని ప్రతి వారం చికెన్, నెలలో రెండుసార్లు మటన్ పెట్టిస్తున్నారు. ఇవి వండిననాడు అందులోని సిబ్బందికి పండుగే. పిల్లలు తిన్నారా  లేదా అని చూడకుండ వారి వెంట తెచ్చుకున్న టిఫిన్ బాక్సుల్లో నింపుతున్నారు. ఇంకొందరు డైనింగ్ హాల్ నుంచి సిబ్బంది ఉండే గదులకు తెప్పించుకొని పుష్టిగా మెక్కుతున్నారు.

నాసిరకం వంట వస్తువులు..

జిల్లా వ్యాప్తంగా ఎస్సి, బిసి, మైనారిటీ గురుకులాలు సుమారు 30 వరకు ఉంటాయి. ఇందులోని విద్యార్థులకు నాణ్యమైన కూరగాయలు, వంట చేసేందుకు అవసమైన దినుసులు(ప్రోవిజన్స్), గుడ్లు, మటన్, చికెన్ సరఫరా చేసేందుకు తరగతులు ప్రారంభ దశలోనే టెండర్లను పిలుస్తుంటారు. అవి పూర్తయ్యాక నాసిరకం వస్తువులను గురుకులాల్లోకి చేర్చుతున్నారు. దొంగలు, దొంగలు ఊళ్లు పంచుకుంటున్నట్లుగా సరఫరదారుడు, ప్రిన్సిపాల్ కలిసి నాణ్యతకు తిలోదకాలిస్తున్నారు.  తనకు ఎదురు మాట్లాడకుండా బాగా ముట్టజేప్పేవాడు సరఫరా చేసేలా  చూసుకుంటున్నారు. ఇంకొన్ని గురుకులాల్లో నాకు నెలకు ఇంత ఇవ్వాలని ప్రిన్సిపాల్స్  డిమాండ్ చేయడం గమనార్హం.

కూరగాయలు సంచుల్లోకి..

విద్యార్థులకు వండి పెట్టేందుకు తెచ్చిన కూరగాయలను కొందరు సంచులలో నింపి ఇంటికి తీసుకుపోతున్నారు. పిల్లలకు పెట్టె ఆహారం కొలత(మెను) ప్రకారం పెడుతుంటారు. దీనిలోనూ సిబ్బంది చేతివాటం ప్రదర్శించడం వల్ల  విద్యార్థులకు  నాణ్యమైన ఆహారం అందకుండాపోతుంది.  డిచ్పల్లి మండల పరిధిలో ఉన్న గురుకులంలో పేరుకు పెద్ద సామజిక వర్గంగా చెప్పుకుంటున్న ఒకావిడ తన ఇంటి కోసం కిచెన్ నుంచి సామాను సర్దుకుంటుందని సమాచారం. పాల పాకెట్లు, కూరగాయలు, పళ్ళు ఒకటేమిటి ఏది కావాలనుకుంటే అవి తీసుకెల్తుండడాన్ని చూసి అందులోని సిబ్బంది నిర్ఘాంతపోతున్నారు. ఇది ఒక ఉదాహరణ మాత్రమే.. జిల్లాలో ఉన్న అన్ని గురుకులాల్లో ఇదే వ్యవహారం  కొనసాగుతోంది. పిల్లల కడుపు కొట్టి సిబ్బంది తినడమే గాకుండా ఇంటికి సామాను మోస్తున్నారు.

 ఆకస్మిక తనిఖీలు లేనందువల్లే

అయా పరిధిలో ఉన్న అధికారులు, నాయకులు ఆకస్మిక తనిఖీలు చేయకపోవడంవల్లే గురుకులాల్లో ఆడిందే ఆటగా సాగుతోంది. ఇటీవల కొన్ని పాఠశాలల్లో విషతుల్యమైన ఆహారం తిన్న విద్యార్థులు ఆసుపత్రుల పాలయ్యారు. ఈ విషయాన్ని కఠినంగా పరిగణించిన  ప్రభుత్వం అన్ని వసతి గృహాలను తనిఖి చేయాలని ఆదేశాలు జారి చేసింది. అధికారులు, నాయకులు గురుకులాల్లో తనిఖీలు ముమ్మరం చేస్తే విద్యార్థులకు పౌష్టికాహారం అందడంతోపాటు సిబ్బంది చేతివాటం, ప్రిన్సిపాళ్ళ కమీషన్లు  తగ్గే అవకాశాలున్నాయి.

Leave A Reply

Your email address will not be published.