. . . నగర మేయర్ ఉమారాణి రమేష్
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
నేటి పోటీ ప్రపంచంలో చిన్నారులకు నాణ్యమైన విద్యతో పాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించే విద్యాసంస్థల అవసరం ఎంతో పెరిగిందని నిజామాబాద్ మేయర్ కూరగాయల ఉమారాణి రమేష్ అన్నారు. నగరంలో చిన్నారులకు నాణ్యమైన, ఆధునిక విద్యను అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన “మై చోటా స్కూల్” పాఠశాల ప్రారంభోత్సవ కార్యక్రమం సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నగర మేయర్ ముఖ్య అతిథిగా హాజరై పాఠశాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, డిజిటల్ క్లాస్‌రూమ్స్, ఎయిర్ కండిషన్డ్ తరగతి గదులు, కృత్రిమ మేధస్సు ఆధారిత బోధనా విధానాలు విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి దోహదపడతాయని పేర్కొన్నారు. విద్యార్థుల్లో సృజనాత్మకత, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలను పెంపొందించేలా పాఠశాల యాజమాన్యం చేపడుతున్న కార్యక్రమాలను ఆమె అభినందించారు. చిన్నారుల భవిష్యత్తుకు నాణ్యమైన విద్యే బలమైన పునాది అని పేర్కొంటూ, తల్లిదండ్రులు తమ పిల్లలకు ఉత్తమ విద్యను అందించే విద్యాసంస్థలను ఎంపిక చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం మేయర్ ఉమారాణి రమేష్‌ను ఘనంగా సన్మానించింది. అనంతరం మేయర్ పాఠశాల యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, విద్యారంగంలో సంస్థ మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

