. . . తీర్మానాల మార్పు,ఆర్థిక లావాదేవీల్లో జోక్యంపై విచారణకు డిమాండ్
. . . జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన ఉపసర్పంచ్ తో పాటు వార్డు మెంబర్స్
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ:
నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలం సుద్దులం గ్రామ పంచాయతీలో సర్పంచ్ భర్త తినేటి లక్ష్మణ్ రెడ్డి పాలన పరమైన వ్యవహారాలలో అతిగా జోక్యం పై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. సర్పంచ్ హేమలత రెడ్డి భర్త తినేటి లక్ష్మణ్ రెడ్డి ఎన్నికైన ప్రజాప్రతినిధి కాకపోయినా పంచాయతీ పరిపాలన, తీర్మానాలు, ఆర్థిక లావాదేవీలు, అభివృద్ధి పనులు, సిబ్బంది వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారని వార్డు సభ్యులు, ఉపసర్పంచ్ జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సోమవారం ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు
పంచాయతీ పాలకవర్గం సమావేశం లో వార్డు సభ్యుల సమక్షంలో ఒక అంశంపై తీర్మానం చేసిన తర్వాత, అందుకు భిన్నంగా మరో తీర్మానం రూపొందించి పంచాయతీ కార్యదర్శిపై ఒత్తిడి తెచ్చి అధికారులకు పంపించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. గ్రామసభలో ఇందిరమ్మ ఇళ్ల అంశంపై తీర్మానం చేయకపోయినా తీర్మానం చేసినట్లు కాపీ జారీ చేసినట్లు ఆరోపించారు. పంచాయతీ ఆవరణలో వార్డు సభ్యులను ఉద్దేశించి తీవ్ర అసభ్య పదజాలంతో మాట్లాడటం తో పాటు బట్టలిప్పి కొడతా, చెప్పుతో కొడతా అంటూ బెదిరించినట్లు ఆరోపించారు. గ్రామసభలో జేసిబి తీసుకొచ్చి బొంద పెడతా అంటూ బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.ఉపసర్పంచ్ చెవిటి నరేష్‌ను కులం పేరుతో దూషించి, చంపేస్తామని బెదిరించినట్లు ఆరోపించారు. ఈ సందర్భంగా సర్పంచ్ కూడా ఉపసర్పంచ్‌పై దాడి చేసినట్లు పేర్కొంటూ ఘటనకు సంబంధించిన వీడియోను పెన్‌డ్రైవ్‌లో సమర్పించినట్లు తెలిపారు.

నిధులపై అనుమానాలు: పంచాయతీ వస్తువుల కొనుగోలు, సేవలకు సంబంధించిన చెల్లింపుల్లో నిబంధనలు పాటిస్తున్నారా? అనే అనుమానాలను వ్యక్తం చేశారు. సుమారు రూ.60 వేలతో చేపట్టిన ఐమాక్స్ లైట్ల మరమ్మతులు కొద్ది కాలానికే పనిచేయకుండా పోయాయని, దీనిపై బిల్లులు, వర్క్ ఆర్డర్లు, చెల్లింపులు, పనుల నాణ్యతపై సాంకేతిక, ఆర్థిక ఆడిట్ నిర్వహించాలని కోరారు. పంచాయతీ సిబ్బందిని సర్పంచ్ ఇంటికి పిలిపించి అక్కడే హాజరు సంతకాలు చేస్తున్నారన్న ఆరోపణలు చేశారు. పంచాయతీ సిబ్బంది రవి వ్యక్తిగత బ్యాంకు ఖాతా, ఫోన్‌పే లావాదేవీలను కూడా విచారించాలని కోరారు. ఆరోపణలు విచారణలో నిజమని తేలితే బాధ్యులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని, విచారణ పూర్తయ్యే వరకు ఫిర్యాదుదారులు, వార్డు సభ్యులు, సాక్షులు ఎలాంటి బెదిరింపులు, కక్షసాధింపు జరగకుండా రక్షణ కల్పించాలని కలెక్టర్‌ను కోరారు. ఫిర్యాదు చేసిన వారిలో సుద్దులం ఉప సర్పంచ్ చెవిటి నరేష్, వార్డు సభ్యులు దొడ లక్ష్మి, లక్కం మనోజ్, కోటగిరి హారిక, వాల్గోట్ లక్ష్మి, బానగారి భూషణ్ రెడ్డి, కల్లెడ సంతోష్ రెడ్డి తదితరులు ఉన్నారు
