. . . సంఘం జిల్లా అధ్యక్షుడు ఊమ్మెడ నారాయణ
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
జిల్లాలోని పోతరాజు, ద్యావతి, ఆసది, కొలుపుల కుల వృత్తుల వారిని ‘పంబాల’ ఉపకులంగా గుర్తించి గ్రూప్-1 కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేయాలని సంఘం జిల్లా అధ్యక్షుడు ఊమ్మెడ నారాయణ అన్నారు. ఈ విషయాన్ని కోరుతూ పోతరాజు, ద్యావతి, పంబాల, ఆసది, కొలుపుల సంఘం నాయకులు సోమవారం జిల్లా అదనపు కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ కరీంనగర్, జగిత్యాల తదితర జిల్లాల్లో గెజిట్ నిబంధనల ప్రకారం పోతరాజు కుల వృత్తి వారిని ‘పంబాల’గా గుర్తించి తహసీల్దార్లు కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తున్నారని తెలిపారు. అదే విధానాన్ని నిజామాబాద్ జిల్లాలోనూ అమలు చేయాలని కోరారు. ఇటీవల నిజామాబాద్‌కు వచ్చిన జస్టిస్ షమీమ్ అక్తర్ నేతృత్వంలోని ఏకసభ్య ఎస్సీ వర్గీకరణ కమిషన్‌ను కలిసి ఉపకులాల పేర్లను జాబితాలో నమోదు చేయాలని కోరగా, సంబంధిత రివ్యూ నివేదిక సమర్పించాలని సూచించారని ఆయన చెప్పారు. జిల్లా కలెక్టర్ ద్వారా ఆర్డీవో, ఎమ్మార్వోలకు ఆదేశాలు జారీ చేస్తే ‘పంబాల’ పేరుతో కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేసే అవకాశం ఉందని వివరించారు. గ్రామ దేవతల ఆరాధనను వృత్తిగా కొనసాగిస్తున్న పోతరాజు, ద్యావతి, ఆసది, కొలుపుల వారిని ‘పంబాల’ ఉపకులంగా అధికారికంగా గుర్తించి గ్రూప్-1 కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి పురుషోత్తం, నాయకులు బక్కూరి గంగాధర్, మురళి, అనంత్ కుమార్, సదాశివ్, కోటేశ్వర్, అర్జున్ తదితరులు పాల్గొన్నారు.
