బాన్సువాడ, బతుకమ్మ :
బాన్సువాడ పట్టణంలో ఘరానా చోరీ జరిగింది. దుండగులు కారు అద్దాలను ధ్వంసం చేసి రూ. 8 లక్షలను ఎత్తుకెళ్లారు. ఈ ఘటన మంగళవారం చోటు చేసుకుంది. బిచ్కుంద మండలం హస్గుల్ గ్రామానికి చెందిన మాధవరావు తన బంధువు హైదరాబాద్లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో ఖర్చుల కోసం డబ్బులు అవసరమయ్యాయి. ఈ క్రమంలో మాధవరావు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బాన్సువాడ శాఖలో తన ఖాతా నుంచి మంగళవారం మధ్యాహ్నం సుమారు 3 గంటల సమయంలో రూ.8 లక్షలు డ్రా చేశారు. అనంతరం పట్టణంలోని తాడ్కోల్ రోడ్డులో ఉన్న రిలయన్స్ స్మార్ట్ వద్ద కారును పార్క్ చేసి సరుకులు కొనడానికి వెళ్లారు. ఈ సమయంలో గుర్తుతెలియని దుండగులు కారు అద్దాలు పగలగొట్టి నగదును ఎత్తుకెళ్లారు. ఈ ఘటనపై బాన్సువాడ డీఎస్పీ విఠల్ రెడ్డి వెంటనే స్పందించి పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరా పుటేజీలను పరిశీలించారు. రద్దీగా ఉండే తాడ్కోల్ ప్రధాన రోడ్డుపై పట్టపగలు రూ.లక్షల్లో చోరీ జరగడంతో పోలీసులు కేసును సీరియస్‌గా తీసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

