ఎర్రజొన్న వ్యాపారుల సిండికేట్‌ను అరికట్టి.. ఎర్రజొన్న పంట ధర తగ్గకుండా చూడాలి

0 9,000

 

. . . జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠికి ఫోన్ చేసి మాట్లాడిన ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి

 

బాల్కొండ, బతుకమ్మ :

 

సీజన్ ప్రారంభంలో ఎర్రజొన్నలు క్వింటాలుకు రూ.3850 పలికిన ధర ప్రస్తుతం వ్యాపారుల సిండికేట్ కారణంగా రూ.3450 వరకు పడిపోయి ఎర్రజొన్న రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. రైతులకు గిట్టుబాటు ధర లభించేలా తక్షణ చర్యలు తీసుకోవాలని బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి జిల్లా కలెక్టర్‌ ఇలా త్రిపాఠిని కోరారు. సోమవారం ఈ విషయమై ప్రశాంత్ రెడ్డి జిల్లా కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడి ఎర్రజొన్న రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించి, వ్యాపారుల సిండికేట్‌ను అరికట్టాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఎర్రజొన్న రైతుల ప్రయోజనాలే ప్రభుత్వానికి పరమావధి కావాలని, రైతులను నష్టపరిచే ఎలాంటి చర్యలనైనా సహించేది లేదని స్పష్టం చేశారు. జిల్లాలో ఎర్రజొన్న వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి కృత్రిమంగా ధరలను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారన్న సమాచారం తమకు అందిందని తెలిపారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ వెంటనే జోక్యం చేసుకుని రైతులకు నష్టం కలగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. గత సంవత్సరం తో పోలిస్తే ఈసారి ఎర్రజొన్న సాగు ఉత్పత్తి గణనీయంగా తగ్గిందని ఎమ్మెల్యే చెప్పారు. రైతులు ఎక్కువగా మొక్కజొన్న పంట వైపు మొగ్గుచూపడంతో ఎర్రజొన్న సాగు తగ్గిందన్నారు. గత సంవత్సరం 34,000 ఎకరాల్లో ఎర్రజొన్న పంట ఉంటే ఈ సంవత్సరము 23,000 ఎకరాలకు ఉత్పత్తి పడిపోయిందన్నారు. ఉత్పత్తి తగ్గిన పరిస్థితుల్లో సహజంగా ధర పెరగాల్సి ఉండగా, వ్యాపారులు కలిసి కృత్రిమంగా ధరలను తగ్గించే ప్రయత్నం చేయడం రైతులకు తీవ్ర అన్యాయం అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రస్తుతం ఎర్రజొన్నకు క్వింటాలుకు కనీసం ₹3850 నుంచి ₹4000 వరకు ధర రావాల్సి ఉండగా, వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి ధరను ₹3400 నుంచి ₹3450 వరకు తగ్గించే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. దీనివల్ల రైతులు తీవ్రంగా నష్టపోతారని అన్నారు.

ఎర్రజొన్న ధర తగ్గడానికి అంతర్జాతీయ యుద్ధ పరిస్థితులను కారణంగా చూపుతూ వ్యాపారులు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని, అయితే ఎర్రజొన్న ప్రధానంగా పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్గానిస్తాన్, ఉత్తర భారతదేశ రాష్ట్రాలకు ఎగుమతి అవుతుందని, అక్కడ ఎలాంటి యుద్ధ పరిస్థితులు లేవని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. కాబట్టి ధర తగ్గింపుకు చెప్పే కారణాలు సమంజసం కావని పేర్కొన్నారు.

గత మూడు నాలుగేళ్లుగా అమలులో ఉన్న నిబంధనలను కఠినంగా అమలు చేయాలని ఎమ్మెల్యే సూచించారు. లైసెన్స్ ఉన్న వ్యాపారులు మాత్రమే విత్తనాలు సరఫరా చేయాలని, విత్తనాలు ఇచ్చే సమయంలో రైతులతో తప్పనిసరిగా బైబ్యాక్ అగ్రిమెంట్ చేసుకోవాలని తెలిపారు. విత్తనాలు ఇచ్చిన వ్యాపారులే రైతుల పంటను కొనుగోలు చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ముఖ్యంగా బాల్కొండ, ఆర్మూర్ నియోజకవర్గాలతో పాటు నిజామాబాద్ రూరల్ జక్రాన్‌పల్లి మండలాల్లో ఎర్రజొన్న సాగు ఎక్కువగా ఉన్నందున అక్కడ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు. రైతులను ఇబ్బంది పెట్టేలా సిండికేట్‌గా వ్యవహరించే వ్యాపారులను ఉపేక్షించకూడదని, వ్యాపారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి రైతులకు నష్టం కలిగించే చర్యలను సహించబోమని స్పష్టంగా హెచ్చరించాలని కోరారు. జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్, జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రత్యేక పర్యవేక్షణ యంత్రాంగం ఏర్పాటు చేసి రైతులకు గిట్టుబాటు ధర అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని రైతులకు కనీసం క్వింటాలుకు ₹4000 ధర అందేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్ కూడా ఈ అంశంపై సానుకూలంగా స్పందించి త్వరలోనే సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించి రైతులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఎర్రజొన్న రైతులు అందరు సంఘటితం కావాలని, గిట్టుబాటు ధర లభించకపోతే పోరాటానికి సిద్ధం కావాలని బిఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పిలుపునిచ్చారు.

Leave A Reply

Your email address will not be published.