27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

రాష్ట్ర కార్మికశాఖ జీవో 282 అమలును నిలిపివేయాలి

Must read

📰 Generate e-Paper Clip

  • టియుసిఐ జిల్లా అధ్యక్ష ,కార్యదర్శులు ఎం.నరేందర్, ఎం.సుధాకర్

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : రాష్ట్ర కార్మికశాఖ జీవో 282 అమలును నిలిపివేయాలని టియుసిఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎం.నరేందర్, ఎం.సుధాకర్ డిమాండ్ చేశారు.  ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శ్రామిక భవన్, కోటగల్లిలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా టియుసిఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎం.నరేందర్, ఎం.సుధాకర్ లు మాట్లాడుతూ జులై 5న రాష్ట్ర ప్రభుత్వ కార్మిక శాఖ షాప్స్ & ఎస్టాబ్లిష్మెంట్ చట్టంలో సవరణ పేరుతో జీవో నెం:282 ను విడుదల చేసిందన్నారు. వాణిజ్య సంస్థల్లో పనిచేసే ఉద్యోగులతో, కార్మికులతో రోజుకు 10 గంటలు పనిచేయించుకోవచ్చని, వారానికి 48 గంటలు మించకూడదని, అది దాటితే ఓటి చెల్లించాలని ఈ జీవోలో పేర్కొన్నదన్నారు. అయితే ఈ జీవోలో అస్పష్టత, సందేహాలు ఉన్నాయన్నారు.     ఈ జీవోలో ఉన్న అస్పష్టతలపై కార్మిక శాఖ మరింత వివరణను, స్పష్టతను ఇవ్వాలని టియుసిఐ డిమాండ్ చేస్తున్నామన్నారు.  కార్మిక శాఖ కార్యాలయంలో రాష్ట్రంలో ఉన్న వ్యాపార వాణిజ్య సంస్థలు ఎన్ని? కార్మిక శాఖలో  వాటి నమోదు జరిగిందా? అందులో పనిచేస్తున్న సిబ్బందికి చెల్లిస్తున్న వేతనాలు ఎంత? ప్రతిరోజు పనిగంటలు రికార్డు అవుతుందా? ఓటి చెల్లిస్తున్నారా?  ఈ వివరాలు కార్మిక శాఖ వద్ద ఉన్నాయా? అని ప్రశ్నించారు. ఇప్పటికే అనధికారికంగా 10 గంటల చొప్పున పనిచేయిస్తున్న యాజమాన్యాల దగ్గర కార్మికులకు ఓటి ఇప్పించే నిర్దిష్టమైన చర్యలు ఉన్నాయా?  మల్టీ నేషనల్, అతి పెద్ద షాపింగ్ మాల్స్ లో సెక్యూరిటీ గార్డులు, సేల్స్ పర్సన్స్, ఇతర సిబ్బంది రోజంతా నిలబడే పనిచేస్తున్నారు. వీరి శ్రమకు తగ్గ ఫలితం అందడం లేదు. కార్మికులకు అందుతున్న సౌకర్యాలు వేతనాలపై కార్మిక శాఖ వద్ద నివేదికలు ఉన్నాయా? అని ప్రశ్నించారు. జీవోలో పనిగంటలను పెంచుతూ మాత్రమే పేర్కొన్నారు. కానీ, కార్మికుల ఉద్యోగ భద్రత, ఆరోగ్య, జీవన భద్రత, తగిన వేతనాలపై స్పష్టత లేదన్నారు. జీవోలో వారి కనీస వేతనం ఎంతో ప్రకటించాలన్నారు. అస్పష్టమైన జీవోవల్ల వాణిజ్య సంస్థలు, యాజమాన్యాలు లాభం పొందుతాయి కానీ, అందులో పని చేసే కార్మికులకు ప్రయోజనం లేదన్నారు. పైగా మరింత శ్రమదోపిడికి గురయ్యే ప్రమాదం ఉందన్నారు. కాబట్టి కార్మిక శాఖ జీవోను అభయన్స్ లో పెట్టి కార్మిక సంఘాలతో చర్చ జరపాలని, కార్మిక సంఘాల సందేహాలపై వివరణ ఇచ్చిన తర్వాతే జీవో అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ప్రెస్ మీట్ తో రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం.వెంకన్న, జిల్లా ఉపాధ్యక్షులు డి.రాజేశ్వర్, జిల్లా నాయకులు పి.సాయన్న తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article