. . . తెలంగాణ అమరుల ఆశయ సాధన బీజేపీ తోనే సాధ్యం
. . . బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని నిజామాబాద్‌లోని బీజేపీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి తెలంగాణ ఉద్యమ అమరవీరులకు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు మొదటి నుంచే ముందువరుసలో నిలబడి పోరాటం చేశారని తెలిపారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు బీజేపీ పార్లమెంట్‌లోనూ, ప్రజాక్షేత్రంలోనూ నిరంతరం పోరాడి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు సంపూర్ణ మద్దతు అందించిందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల ప్రేమాభిమానాలతో “తెలంగాణ చిన్నమ్మ”గా గుర్తింపు పొందిన సుష్మా స్వరాజ్ సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. తెలంగాణ బిల్లు పార్లమెంట్‌లో ఆమోదం పొందే సమయంలో ఆమె చూపిన చొరవ, తెలంగాణ ప్రజల పట్ల ఆమెకున్న అంకితభావం చిరస్మరణీయమని కొనియాడారు. అదేవిధంగా, 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిందని విమర్శించారు. ప్రత్యేక తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల కుటుంబాలకు సంపూర్ణ న్యాయం చేయడంలో విఫలమైందని అన్నారు.అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లుపూర్తవుతున్నప్పటికీ తెలంగాణ ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలకు ఇచ్చిన హామీల అమలులో స్పష్టమైన పురోగతి కనిపించడం లేదని పేర్కొన్నారు. ఉద్యమ స్ఫూర్తిని కాపాడటంలో, అమరవీరుల కుటుంబాలకు భరోసా కల్పించటంలో ప్రభుత్వం మరింత బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుల త్యాగాలు ఎన్నటికీ మరువలేనివని, వారి కుటుంబాలకు సంపూర్ణ న్యాయం జరగాలని, తెలంగాణ ఉద్యమకారుల గౌరవం, హక్కుల పరిరక్షణ కోసం భారతీయ జనతా పార్టీ ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు.తెలంగాణ ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన అమరవీరుల ఆశయాలకు అనుగుణంగా అభివృద్ధి చెందిన, సమృద్ధి చెందిన తెలంగాణ నిర్మాణం కోసం అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి గోపిడి స్రవంతి రెడ్డి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ప్రమోద్ కుమార్, రూరల్ కన్వీనర్ పద్మారెడ్డి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ జ్యోతి, మల్కాయ్ మహేందర్, బీజేవైఎం రాష్ట్ర కో-కోశాధికారి అమంద్ విజయ్ కృష్ణ, స్వామి యాదవ్, నాగరాజ్, ఆనంద్ రావు, జగన్ రెడ్డి, ఆనంద్,పవన్ ముందడతో పాటు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
